ఓ దేవా, నీ కరుణకు హద్దులు లేవు, నీ మంచితనపు నిధి అనంతమైనది…” (“తే దేయుమ్” స్తుతిగీతం తరువాతి ప్రార్థన)
“కారుణ్యాన్ని వెల్లడించి, కార్యరూపంలోకి తెచ్చే ఈ ప్రక్రియకు పాస్కా మర్మమే పరాకాష్ఠ. ఈ కారుణ్యం మానవుని నీతిమంతునిగా చేయగలదు; ఆదినుండి దేవుడు మానవునిలోనూ, మానవుని ద్వారా లోకంలోనూ సంకల్పించిన రక్షణ క్రమానికి అనుగుణంగా న్యాయాన్ని పునరుద్ధరించగలదు” (విశ్వలేఖ దివెస్ ఇన్ మిసెరికోర్దియా, సం. 7).
“అందువల్ల, దూరదృష్టితో కూడిన ఆత్మపాలనా సున్నితత్వంతో, క్రైస్తవ విశ్వాసానికి చెందిన ఈ ఆజ్ఞలను, బోధనలను విశ్వాసుల ఆత్మలలో లోతుగా ముద్రించేందుకు, కారుణ్య పితను ధ్యానించడం ద్వారా ప్రేరణ పొందిన పరమ పీఠాధిపతి రెండవ జాన్ పాల్, పునరుత్థానకాలపు రెండవ ఆదివారాన్ని ఈ కృపావరాలను ప్రత్యేక భక్తితో స్మరించుకోవడానికి అంకితం చేయాలని సంకల్పించి, ఈ ఆదివారానికి “దైవకారుణ్య ఆదివారం” అనే పేరు ఇచ్చారు (దైవారాధన మరియు సంస్కారాల క్రమశిక్షణ సంఘం, ఆజ్ఞాపత్రం మిసెరికోర్స్ ఎత్ మిసెరాతోర్, 5 మే 2000).
సంపూర్ణ పాపదండ విమోచనం
I. ప్రతి సంపూర్ణ పాపదండ విమోచనానికి సాధారణ షరతులు:
- పాపసంకీర్తన సంస్కారాన్ని స్వీకరించడం [గతంలో జారీచేసిన నియమాల ప్రకారం, సుమారు 20 రోజుల ముందు లేదా తరువాత]
- దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం [గతంలో జారీచేసిన నియమాల ప్రకారం, వీలైనంతవరకు అదే రోజున, లేదా దానికి ముందు లేదా తరువాతి రోజుల్లో]
- పరమ పీఠాధిపతి ఉద్దేశాల కోసం ప్రార్థించడం [నిర్దిష్ట ప్రార్థనలేవీ సూచించబడలేదు]
II. ఈ పాపదండ విమోచనానికి ప్రత్యేక షరతులు
దైవకారుణ్య ఆదివారంనాడు
- ఏ దేవాలయంలోనైనా లేదా ప్రార్థనాలయంలోనైనా, స్వల్పపాపంతో సహా ఏ పాపంపట్లా మమకారం లేని మనోభావంతో, దైవకారుణ్య గౌరవార్థం నిర్వహించే ప్రార్థనలలో, భక్తి కార్యక్రమాలలో పాల్గొనాలి
- లేదా, ఆరాధనకు ఉంచిన లేదా దివ్యసత్ప్రసాద మందసంలో భద్రపరచిన దివ్యసత్ప్రసాద సన్నిధిలో, పరలోక ప్రార్థనను, విశ్వాస ప్రమాణాన్ని పఠించి, కరుణామయుడైన ప్రభు యేసుకు భక్తిపూర్వకమైన ఒక ప్రార్థనను జోడించాలి (ఉదా. కరుణామయ యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను!”)
పాక్షిక పాపదండ విమోచనం
కనీసం పశ్చాత్తాప హృదయంతోనైనా, చట్టబద్ధంగా ఆమోదించబడిన ఆవాహన ప్రార్థనతో కరుణామయుడైన ప్రభు యేసును ప్రార్థించే విశ్వాసులకు పాక్షిక పాపదండ విమోచనం అనుగ్రహించబడుతుంది. [ఉదా. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను. నా యేసూ, కరుణించు. లేదా ఆమోదించబడిన మరేదైనా ఆవాహన ప్రార్థన]
దేవాలయానికి వెళ్లలేనివారు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు
సంపూర్ణ పాపదండ విమోచనానికి షరతులు:
- ఏ పాపాన్నైనా పూర్తిగా అసహ్యించుకుంటూ,
- పాపసంకీర్తన, దివ్యసత్ప్రసాద స్వీకరణ, పరిశుద్ధ పిత ఉద్దేశాల కోసం ప్రార్థనలు అనే మూడు సాధారణ షరతులను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలనే ఉద్దేశం కలిగి ఉండాలి
- మన కరుణామయుడైన ప్రభు యేసు పవిత్ర చిత్రం ముందు పరలోక ప్రార్థనను, విశ్వాస ప్రమాణాన్ని పఠించాలి
- కరుణామయుడైన ప్రభు యేసుకు భక్తిపూర్వకమైన ఆవాహన ప్రార్థన చేయాలి (ఉదా. కరుణామయ యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను).
ఇది చేయడం కూడా అసాధ్యమైతే:
- పాపదండ విమోచనాన్ని సాధారణ పద్ధతిలో పొందేందుకు నిర్దేశించిన ఆచరణను నెరవేరుస్తున్నవారితో ఆధ్యాత్మిక ఉద్దేశంతో ఐక్యమై,
- సంపూర్ణ పాపదండ విమోచనాన్ని పొందేందుకు నిర్దేశించిన మూడు షరతులను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చాలనే సంకల్పంతో, కరుణామయుడైన ప్రభువుకు ఒక ప్రార్థనను, తమ అనారోగ్య బాధలను, తమ జీవితపు కష్టాలను సమర్పించాలి.
గురువుల కర్తవ్యం
ఆత్మపాలనా పరిచర్య చేస్తున్న గురువులు, ప్రత్యేకించి విచారణ గురువులు,
- [సంపూర్ణ పాపదండ విమోచనానికి సంబంధించి] కతోలిక సభ కల్పించిన రక్షణదాయకమైన ఈ ఏర్పాటును అత్యంత సముచితమైన విధంగా విశ్వాసులకు తెలియజేయాలి.
- వారి పాపసంకీర్తనలను వినడానికి వెంటనే, ఉదారంగా సంసిద్ధులై ఉండాలి [ఇది తప్పనిసరిగా దైవకారుణ్య ఆదివారంనాడే జరగనవసరం లేదు, ఎందుకంటే అది పాపదండ విమోచనానికి షరతు కాదు]
దైవకారుణ్య ఆదివారంనాడు, దివ్యబలిపూజ లేదా సాయంకాల ప్రార్థన నిర్వహించిన తరువాత, లేదా దైవకారుణ్య గౌరవార్థం జరిగే భక్తి కార్యక్రమాల సమయంలో,
- ప్రార్థనల పఠనాన్ని నడిపించాలి
- తమ ప్రజలకు బోధించేటప్పుడు, వీలైనంత తరచుగా ప్రేమకార్యాలు లేదా కరుణాకార్యాలు చేయాలని విశ్వాసులను మృదువుగా ప్రోత్సహించాలి
