తెలుగు

ధ్యానం 316: ప్రజ్వలించే ప్రేమజ్వాల

చిత్రం సౌజన్యం: Pixabay

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవుని ప్రేమను వర్ణించడానికి మనం ఎన్నో రూపకాలను ఉపయోగిస్తాం. వాటిలో ఒకటి “ప్రజ్వలించే ప్రేమజ్వాల.” సిలువకు చెందిన పునీత యోహాను రచించిన ఆధ్యాత్మిక విశిష్ట గ్రంథం “ప్రేమ యొక్క సజీవ జ్వాల”లో ఇది కనిపిస్తుంది:

ఓ ప్రేమ యొక్క సజీవ జ్వాలా,
నా ఆత్మను మృదువుగా గాయపరుస్తున్నావు
దాని అత్యంత లోతైన కేంద్రంలో! ఇప్పుడు
నీవు పీడించడం లేదు గనుక,
ఇక పరిపూర్ణం చేయి! నీ చిత్తమైతే:
ఈ మధురమైన కలయికకు అడ్డుగా ఉన్న తెరను చీల్చివేయి!

దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి మనలో మండే అగ్నిగా ఎందుకు మాట్లాడతాం? ఇది ఎంతో సమయం వెచ్చించి ధ్యానించదగిన శక్తివంతమైన రూపకం. జ్వాల ఎన్నో పనులు చేస్తుంది. అది వెలుగునిస్తుంది, శుద్ధిచేస్తుంది, దహించివేస్తుంది, వేడిని శక్తిని వెదజల్లుతుంది, మనలను దగ్గరకు ఆకర్షిస్తుంది, ఎప్పటికప్పుడు మారుతూ నిత్యనూతనంగా ఉంటుంది; ఇంకా ఎన్నో చేస్తుంది. దేవుని ప్రేమ మీలో ఒక నిప్పురవ్వగా లేదా జ్వాలగా మాత్రమే ఉండిపోకూడదు. అది మీ ఆత్మను దహించివేస్తూ, దాని స్థానంలో దేవుని తేజస్సును, దివ్యసాన్నిధ్యాన్ని ఉద్భవింపజేసే, ఉవ్వెత్తున ఎగసిపడే ప్రేమాగ్నిగా మారాలి (చూడండి డైరీ #1523).

దేవుని ప్రేమను చూపే ఈ రూపకాన్ని గురించి ఈ రోజు ఆలోచించండి. మీ అంతరంగంలో ఉవ్వెత్తున ఎగసిపడుతూ, సమస్తాన్నీ దహించే ఈ అగ్నిని గురించి ధ్యానించండి. ఇటువంటి సజీవ జ్వాల ఎలాంటి ప్రభావాలను కలిగిస్తుంది? అది మీ జీవితంలో ఏమి చేస్తుంది? ఈ జ్వాల ప్రజ్వలిస్తున్నప్పుడు ఇతరులు ఏమి గమనిస్తారు? ఈ పవిత్ర రూపకాన్ని మననం చేసుకుంటూ, అంతరంగం నుండి మిమ్మల్ని దహించివేయమని ప్రేమ యొక్క సజీవ జ్వాలను ఆహ్వానించండి.

ప్రభువా, నా వద్దకు వచ్చి, ప్రజ్వలించే నీ ప్రేమాగ్నితో నన్ను దహించివేయి. ప్రతి పాపాన్నీ శుద్ధిచేసి, అందరికీ కనిపించేలా నన్ను నీ కృపాకారుణ్యాల వెలుగుగా మార్చు. నీవు ఎల్లప్పుడూ మండుతూనే ఉన్నా ఎన్నడూ హాని చేయని శక్తివంతమైన జ్వాలవు. నీవు నన్ను నూతనపరచి, నా అంతరంగం నుండి నీ సాన్నిధ్యాన్ని ప్రసరింపజేస్తావు. ప్రియ ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మధురమైన ప్రేమతో నన్ను జ్వలింపజేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నవంబర్ 12: పునీత యోసఫాత్, బిషప్పు మరియు వేదసాక్షి స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు