తెలుగు

ధ్యానం 216: నిజమైన ప్రేమ ద్వారా మనస్సుకు స్పష్టత

పవిత్ర అంతొనీనుస్ ప్రేమసేవ, కర్త: లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0.

వీడియో

ఆంగ్లంలో వినండి

అనుగ్రహం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగల అనేక బోధనలను మన కతోలిక సభ మన ముందుంచుతుంది.  కొన్ని బోధనలు నైతికతకు సంబంధించినవి; అవి గొప్ప సద్గుణాలతో కూడిన జీవితానికి మనల్ని పిలుస్తాయి.  కొన్ని బోధనలు దేవుని గురించి, ఆయన ఉనికి, సారస్వరూపం గురించి తెలియజేస్తాయి.  కొన్ని బోధనలు మానవత్వానికి సంబంధించినవి; మనం ఎవరో అవి స్పష్టం చేస్తాయి.  మనం అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రేమ లేకుండా కతోలిక సభ బోధించే దేనినీ పూర్తిగా అర్థం చేసుకోలేము.  దేవుడు మనకు వెల్లడించిన అనేక సత్యాల చుట్టూ ఉన్న ఇటుక గోడలో అమర్చిన కిటికీ వంటిది ప్రేమ.  ఆ కిటికీని కనుగొని దాని గుండా లోపలికి చూస్తే తప్ప, దేవుడు ప్రతిరోజూ మనకు బోధించాలనుకునేవన్నీ మనకు తెలియకుండానే ఉండిపోతాయి.  దేవుని పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ జీవితంలోని అత్యంత గొప్ప రహస్యాలను త్వరగా అర్థం చేసుకోవడానికి మనకు తోడ్పడతాయి.  ప్రేమ ద్వారా మన మనస్సులు జీవితాన్నీ, విశ్వాసంలో దేవుడు మనకు వెల్లడించాలనుకునేవాటన్నిటినీ గ్రహించి, స్పష్టంగా అర్థం చేసుకుంటాయి.  ఆధ్యాత్మికమైన, నిస్వార్థమైన, త్యాగపూరితమైన ప్రేమతో దేవుణ్ణీ ఇతరులనూ ప్రేమించాలని ఎంచుకోండి; జీవితంలో మీ అవగాహనకు ఆ ప్రేమ మూలంగా మారనివ్వండి (చూడండి: దినచర్య #1123).

మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా అయోమయానికి గురిచేసేది ఏమిటి?  కతోలిక సభ బోధించే విశ్వాస సత్యాలలో మీకు అర్థం కానిది ఏదైనా ఉందా?  లేదా మీకున్న ఏదైనా సంబంధాన్ని ఎలా ఎదుర్కోవాలో, దాని అంతరంగంలో ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక అయోమయానికి లోనవుతున్నారా?  మీకు దేనిని “పరిష్కరించడం” కష్టంగా అనిపించినా, దేవుణ్ణీ ఇతరులనూ నిర్మలమైన ప్రేమతో, కారుణ్య ప్రేమతో ప్రేమించాలని మీరు ఎంచుకున్నప్పుడే మీకు సమాధానం లభిస్తుందని తెలుసుకోండి.  ఇది మీ భావాలపై ఆధారపడిన స్వార్థపూరిత ప్రేమ కాదు; యేసునూ ఆయన సిలువనూ అనుకరించే త్యాగపూరితమైన, నిస్వార్థమైన ప్రేమ.  ఈ ప్రేమకు కట్టుబడి ఉండండి; అప్పుడు మీరు జీవిత రహస్యాలను త్వరగానూ సులభంగానూ గ్రహిస్తారు.

ప్రభువా, దయచేసి నాకు జ్ఞానవెలుగును ప్రసాదించు.  నిర్మలమైన, పవిత్రమైన ప్రేమ జీవిత రహస్యాలకు ద్వారం తెరుస్తుందని గ్రహించడానికి నాకు సహాయం చేయి.  నీ పట్ల నాకున్న ప్రేమ ద్వారా ఆ ద్వారాన్ని తెరిచి, నీవు నాకు బోధించాలనుకునేవన్నీ తెలుసుకునేలా చేయి.  ఇది నీ కారుణ్యం; దీనికై నేను నిత్యం కృతజ్ఞతతో ఉంటాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆగస్టు 4 – పవిత్ర జాన్ వియాన్నీ, గురువు — స్మరణ

 

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు