తెలుగు

ధ్యానం 217: సోమరితనంతో, నిష్క్రియగా ఉండే ఆత్మ

అన్‌స్ప్లాష్ ద్వారా చిత్రం, నాథన్ డుమ్లావో తీసినది

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవుని విషయాల్లో మన ఆత్మలు సోమరితనంతో, నిష్క్రియగా మారేందుకు అనుమతించినప్పుడు మనం దుష్టుణ్ణి సంతోషపెడతాం.  దేవుని జీవంలో పాలుపంచుకోవడానికి ప్రయత్నించని ఆత్మ నిష్క్రియమైన ఆత్మ.  ఆధ్యాత్మిక విషయాల్లో క్రియాశీలంగా కాకుండా నిష్క్రియగా ఉండేదే అలాంటి ఆత్మ.  “నిష్క్రియగా” ఉండటమంటే, ఆ వ్యక్తి విశ్వాసం, నైతికతకు సంబంధించిన విషయాల పట్ల కొంత ఉదాసీనంగా ఉండటం.  ఈ విషయాలపై ఆసక్తి తక్కువగా ఉంటుంది; దాని ఫలితంగా వాటి కోసం చేసే కృషి కూడా చాలా తక్కువగా ఉంటుంది.  మీ ఆధ్యాత్మిక జీవితంలో నిష్క్రియగా ఉంటూ దుష్టుణ్ణి ఆనందపరచకండి.  పవిత్రతా మార్గంలో ఉత్సాహంతో, తపనతో, శ్రమిస్తూ, శ్రద్ధతో, నిబద్ధతతో ముందుకు సాగండి.  ఉదారంగా మిమ్మల్ని మీరు మన ప్రభువుకు సమర్పించుకుంటూ జీవించడం ద్వారా ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ప్రయత్నించండి.  మీ ఆత్మలోని శక్తులన్నిటితో అలా చేయడంలో ఎన్నడూ అలసిపోకండి (చూడండి: దినచర్య #1127).

మీకు దేనిపట్ల తపన ఉంది?  ఉదాహరణకు, మీకు ఏదైనా అభిరుచి లేదా కాలక్షేపం ఉందా?  మీరు ఎంతో ఇష్టంగా చేస్తూ, ఎక్కువ సమయం వెచ్చించే పని ఏదైనా ఉందా?  ఒక అభిరుచి ఆరోగ్యకరమైనదే కావచ్చు; అయినా, మీ ప్రధానమైన “కాలక్షేపం” దేవుణ్ణి వెదకడం, ఆయన పవిత్ర చిత్తాన్ని నెరవేర్చడం కావాలి.  దేవునిపట్ల మీ ప్రేమకంటే ఎక్కువ సమయాన్ని, శ్రద్ధను జీవితంలో మరేదీ ఆక్రమించకూడదు.  మీ విశ్వాస జీవితంలో మీరు ఎంత దృఢసంకల్పంతో ఉన్నారో ధ్యానించండి.  కరుణామయుడైన మీ ప్రభువుతో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి మీరు ఎంత నిబద్ధతతో ఉన్నారు?  ఈ విషయంలో మీరు నిష్క్రియగా లేదా సోమరితనంతో ఉన్నారా?  దేవునిపట్ల మీ ఉత్సాహాన్ని పునరుద్ధరించుకోండి; ఆ ఉత్సాహం మిమ్మల్ని మీ ప్రభువుతో అంతకంతకూ గాఢమయ్యే అనుబంధంలోకి నడిపించనివ్వండి.  వారానికి ఒక గంటకంటే ఎక్కువ సమయాన్ని ఆయనకు ఇవ్వండి; అప్పుడు మీ నిబద్ధతకు ఫలంగా ఆశీర్వాదాలను పొందుతారు. 

ప్రభువా, నేను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను.  అయినా, కొన్నిసార్లు నిష్క్రియగా, సోమరితనంతో ఉండటానికే మొగ్గుచూపుతూ, పవిత్రతను తగినంతగా కోరుకోవడం లేదని గ్రహిస్తున్నాను.  దయచేసి నా ఉత్సాహాన్ని, నిన్ను మరింతగా తెలుసుకోవాలనే నా కోరికను పెంచు.  నీ పట్ల మరింత గాఢమైన ప్రేమలో నేను ఎదుగుతున్నప్పుడు, ఆ ప్రేమను అధికం చేసి, అది అంతకంతకూ వేగంగా విస్తరిస్తూ ఉండేందుకు తోడ్పడు.  ప్రియ ప్రభువా, నిన్ను వెదకడంలోనూ, నిన్ను ప్రేమించడంలోనూ నేను ఎన్నడూ అలసిపోకుందును గాక.  నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఆగస్టు 5 – సెయింట్ మేరీ మేజర్ బసిలికా ప్రతిష్ఠాపన

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు