తెలుగు

ధ్యానం 252: కారుణ్యం, ఆదరణల అపొస్తల సేవ

కారుణ్యపు ఏడు కార్యాలు, రైక్స్‌మ్యూజియం వారి చిత్రం

వీడియో

ఆంగ్లంలో వినండి

కొందరు జీవితంలో తీవ్రంగా కలత చెందుతూ, తమ కష్టాలను పరిష్కరించుకోలేకపోతున్నట్లు కనిపిస్తారు. తమకు ఓదార్పునిచ్చేదాని కోసం నిరంతరం వెదుకుతూ ఉంటారనే అర్థంలో వారు “అవసరంలో ఉన్నవారు.” తమకు కావలసింది సంపదలే లేదా ఇతర రకాల లౌకిక ఓదార్పులే అని వారు భావించవచ్చు. అయితే తమ అవసరాలన్నిటికీ ప్రభువే సమాధానమని వారు గ్రహించరు. ఇలా దిక్కుతోచక తిరుగుతున్న ఆత్మలపై మన కారుణ్యం కేంద్రీకృతం కావాలి. వారిపట్ల మృదువుగా ఉంటూ, వారిని ఆదరించే హృదయాన్ని, వారి మాట వినే చెవిని అందించడం ద్వారా మనం వారికి దేవుని కారుణ్యాన్ని అందిస్తాము. జీవితంలో పెనుభారాలు మోస్తున్నవారు మనకు తమపట్ల శ్రద్ధ ఉందని, తమ మాట వినాలని మనం కోరుకుంటున్నామని తెలుసుకున్నప్పుడు, తరచుగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ హృదయాలను మనకు తెరచి, తమ గాయాలను, కష్టాలను వెల్లడిస్తారు. వారికి స్వస్థత చేకూర్చడం లేదా వారి సమస్యలను పరిష్కరించడం మన ప్రధాన బాధ్యత కాదు. మనకు వారిపట్ల శ్రద్ధ ఉందని, వారిని అర్థం చేసుకుంటున్నామని తెలియజేయడమే చాలా సందర్భాల్లో మన బాధ్యత. ప్రేమతో ఆదరించే ఈ కార్యం, యేసు హృదయం నుండి మన ద్వారా ప్రవహించే అసాధారణ కారుణ్య కార్యం (చూడండి దినచర్య #1282).

జీవితంలో కలత చెంది, భారాలతో కుంగిపోతున్నవారు మీకు ఎదురైనప్పుడు, మీరు వారితో ఎలా వ్యవహరిస్తారు? వారిని తీర్పుతీరుస్తూ, అసహ్యించుకుంటూ చూస్తారా? లేక వారి మాట విని, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, ఆదరణతోను కరుణతోను నిండిన హృదయాన్ని వారికి అందిస్తారా? ఈ ప్రశ్న గురించి ధ్యానించండి. మీ ద్వారా దేవుని ప్రేమను, ఆదరణను తెలుసుకోవలసినవారిని దేవుడు మీ జీవితంలో ఉంచారు; వారి గురించి ఆలోచించండి. ఈ కార్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే దేవుని కారుణ్యానికి అపొస్తలులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు.

ప్రభువా, నీ కరుణామయ హృదయపు అపొస్తల సేవకై నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నీ దైవకారుణ్యం అత్యంత అవసరమైన ఆత్మలపట్ల నిజమైన కనికరాన్ని, వారిని ఆదరించే మనసును నాకు దయచేయి. వారి మాట వినడానికి, వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి, నీ పవిత్ర హృదయానికి ప్రతినిధిగా వారికి తోడుగా ఉండటానికి నాకు సహాయం చేయి. ప్రియమైన ప్రభువా, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. నీ చిత్తానుసారం నన్ను ఉపయోగించుకో. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

వ్యాకుల మాతకు నవదిన ప్రార్థన
సంప్రదాయంగా సెప్టెంబర్ 7–15 తేదీలలో ప్రార్థిస్తారు

సెప్టెంబరు 9 – గురువైన పునీత పేతురు క్లావెర్ స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు