కార్ల్ బ్లాక్ చిత్రించిన దేవాలయంలో డబ్బు మార్చేవారిని వెళ్లగొడుతున్న యేసు
ఆంగ్లంలో వినండి
మనలో ప్రతి ఒక్కరికీ అప్పుడప్పుడు ఇతరుల పాపం ఎదురవుతుందనడంలో సందేహం లేదు. అది వారి మాటల్లోనో, పనుల్లోనో, చేయవలసినది చేయకపోవడంలోనో ఉండవచ్చు. పాపం బాధపెడుతుంది; దానిని సరిదిద్దవలసిన అవసరం ఉంది. చాలా తరచుగా, ఇతరులు మనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ మనకు కలిగే కోపం ఎల్లప్పుడూ “పవిత్రమైన కోపం” కాదు; అందువల్ల అది ఎల్లప్పుడూ దేవుని నుండి వచ్చేది కాదు. ఇతరులను కఠినంగా, లేదా పైకి కనిపించని రీతిలో కూడా సరిదిద్దడానికి మన దెబ్బతిన్న అహంకారమే మూలంగా మారేలా మనం సులభంగా అనుమతించవచ్చు. అప్పుడు ఇది మన పాపంగా మారుతుంది. అయితే పాపాన్ని ఎదిరించాలి; కొన్నిసార్లు ఇతరులను సరిదిద్దమని దేవుడు మనలను పిలుస్తాడు. మన దిద్దుబాటు తీవ్రంగా కూడా ఉండవచ్చు. కానీ మనకు ప్రేరణనిస్తూ, మార్గనిర్దేశం చేసే దేవుని పవిత్రత నుండి అది వచ్చినప్పుడు, మనం ఇతరులను సరిదిద్దడం వారిని గాయపరచదు; అది కారుణ్య కార్యమవుతుంది. వారికి కఠినత అవసరం కావచ్చు; కఠినంగా ఉండమని దేవుడు మనకు ప్రేరణ కలిగించవచ్చు. అయినా మనం అందించేది అంతిమంగా దేవుని కారుణ్యం నుండే ప్రవహించేలా ఎల్లప్పుడూ జాగ్రత్తపడాలి (చూడండి డైరీ #633).
ఇటీవల మీరు ఎదుర్కొన్న వివాద సందర్భాలను గురించి ఆలోచించండి. ప్రేమకంటే అనారోగ్యకరమైన భావోద్వేగాల ఆధారంగా మాట్లాడిన మాటలు లేదా చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? ఇతరుల వల్ల బాధపడినప్పుడు మీరు ఎలా స్పందిస్తారో పరిశీలించుకోండి. ఆ క్షణంలో పవిత్రమైన మందలింపు రూపంలో చూపవలసి వచ్చినా, మీరు వారిని కారుణ్యంతో చూసి, వారికి దేవుని కారుణ్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తారా? ఈ రూపంలోని కారుణ్యాన్ని అందించడానికి దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోనివ్వడానికి భయపడకండి. దీనికీ కోపమనే పాపానికీ మధ్య తేడాను గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. అయినా, మనం ప్రేమించడానికి పిలువబడినవారి మేలు కోసం ఈ కారుణ్యాన్ని అందించడానికి కృషి చేయాలి.
ప్రభువా, నీ దైవకారుణ్య సాధనంగా నన్ను ఉపయోగించుకునేలా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఇతరులు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, వెంటనే క్షమించడానికి నాకు సహాయం చేయుము. అలాగే, ఇతరుల పాపాలను ఏ విధంగా ఎదుర్కోవడం ఉత్తమమో తెలుసుకోవడానికి కూడా నాకు సహాయం చేయుము. వారి మేలు కోసం ప్రేమతో ఎలా సరిదిద్దాలో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయుము. ప్రియమైన ప్రభువా, నాకు ధైర్యాన్ని, వివేకాన్ని ప్రసాదించి, నీ చిత్తానుసారం నన్ను ఉపయోగించుకొనుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మే 10 – ఈ సంవత్సరం ఆదివారం రావడం వల్ల ప్రార్థనా సంవత్సర స్మరణ దినంగా జరుపుకోబడదు
మొలోకైకు చెందిన పునీత దమియన్ డె వూస్టర్, యాజకుడు
ఆవిలాకు చెందిన పునీత యోహాను, యాజకుడు, సభ పండితుడు
పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




