తెలుగు

ధ్యానం 123: అవమానాల ఆశీర్వాదం

అపహాస్యానికి గురైన క్రీస్తు (ముళ్లకిరీటం పెట్టడం) చిత్రకారుడు: పియేత్రో దెల్లా వెక్కియా

వీడియో

ఆంగ్లంలో వినండి

సరైన ఆలోచన ఉన్నవారెవరైనా అవమానానికి గురికావాలని కోరుకుంటారా?  మీరు అవమానానికి గురైతే ఏమి చేస్తారు?  చాలామందికి అవమానాన్ని తప్పించుకునే మార్గాలను వెదకాలనిపిస్తుంది. దానివల్ల కొందరు తీవ్రంగా బాధపడతారు.  మరికొందరు కోపంతో తమను తాము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తారు.  మనకు అవమానం కలిగించినది అన్యాయమైనదే కావచ్చు. అయినప్పటికీ, అవమానాలు దేవుని కృపాకారుణ్యాల అగాధాల్లోకి ప్రవేశించమనే ఆహ్వానంగా మారగలవని అర్థం చేసుకోవడం ముఖ్యం.  అవమానాన్ని సరైన విధంగా స్వీకరించినప్పుడు, అది మనలో వినయాన్ని కలిగించగలదు.  కోపం, మనోవేదన కూడా కలగవచ్చు; అయినా వినయమే మన లక్ష్యంగా ఉండాలి.  మనం అనుభవించే అహంకారాన్ని, కోపాన్ని, మనోవేదనను విడిచిపెట్టి, వినయపు లోతుల్లోకి ప్రవేశించడానికి మనలను మనం అనుమతించుకోవడమే అన్నిటికన్నా ముఖ్యం.  అత్యావశ్యకమైన ఈ గుణం వల్ల మనం కేవలం దేవునిపైనే ఆధారపడగలుగుతాము, ఆయన నుండే ఓదార్పును, శాంతిని కోరుకోగలుగుతాము; ఆయనే, ఆయన పవిత్ర చిత్తమే మన జీవితానందానికి ఏకైక మూలంగా ఉండనివ్వగలుగుతాము.  అవమానాల ద్వారా కలిగే వినయం కంటే ఆత్మకు మేలు చేసేది మరొకటి ఉండదు (చూడండి: డైరీ #593).

మీరు అత్యంత వినమ్రంగా ఉండేలా చేసేది ఏమిటి?  మీ అహంకారాన్ని దెబ్బతీసి, మీకు కోపం తెప్పించేది లేదా మిమ్మల్ని మీరు సమర్థించుకునేలా చేసేది ఏమిటి?  మీరు దేని గురించి లోలోపల కుమిలిపోతూ, పదేపదే ఆలోచిస్తుంటారు?  ఏదైనా మీకు గుర్తుకొస్తే, ప్రభువు కృపాకారుణ్యాల మూలంగా మార్చాలని కోరుకునే నిర్దిష్టమైన విషయం అదే కావచ్చు.  పాపమైనా, అన్యాయమైనా, మనోవేదనైనా, మరేదైనా సరే—ప్రతిదానినీ మన ప్రభువు కృపకు సాధనంగా మార్చగలరు.  ఆయన నిజంగా అంతటి సర్వశక్తిమంతుడు.  మీ అహంకారాన్ని అన్నిటికన్నా ఎక్కువగా దెబ్బతీసేదేమిటో గుర్తించండి. దానిని ప్రభువు కృపకు మూలంగా మార్చనిస్తూ, ఒక కొత్త దృక్కోణంతో చూడటానికి ప్రయత్నించండి.

ప్రభువా, నా అహంకారం ఎన్నోసార్లు దెబ్బతింటుంది.  నాకు ఇబ్బంది కలిగించే అనుభవాలు ఎన్నో ఎదురవుతుంటాయి.  నా నియంత్రణలో లేని ఆ విషయాలన్నిటినీ నీవు నీ కృపతో మార్చడానికి అనుమతించేలా నాకు సహాయం చేయి. అప్పుడు అవి నన్ను కుంగదీస్తూ, మనోవేదనను, కోపాన్ని కలిగించే భారాలుగా ఇక ఉండవు.  ప్రియమైన ప్రభువా, ఈ అవమానాలను స్వీకరించి, వాటి ద్వారా నా హృదయాన్ని మార్చు. తద్వారా నా వినయంలో నేను నిన్ను మరింత సన్నిహితంగా తెలుసుకొని, నీకు మరింత సంపూర్ణంగా నన్ను సమర్పించుకోగలను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మే 3 – అపొస్తలులైన పునీత ఫిలిప్పు, పునీత యాకోబు
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున దీనిని ప్రార్థనాక్రమ స్మరణ దినంగా ఆచరించరు

పాస్కా కాల ప్రార్థనలు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు