చిత్రం సౌజన్యం: పిక్సాబే.
ఆంగ్లంలో వినండి
మనందరిలోనూ సాధారణంగా ఉండే ఒక ప్రవృత్తి కుతూహలం. దాదాపు ప్రతి విషయం గురించి తెలుసుకోవాలనే కోరికతో మనలో సులభంగా కుతూహలం కలుగుతుంది. పత్రికలు, వార్తా వ్యాసాలు, కార్యక్రమాలు, రోజువారీ కబుర్లు మొదలైనవన్నీ మన కుతూహలాన్ని తీర్చడమే లక్ష్యంగా ఉంటాయి. ఈ కుతూహలం దేవుణ్ణి, ఆయన మనతో చెప్పే సమస్తాన్ని తెలుసుకోవాలనే కోరికగా మారాలి. అయితే, అలా అన్నప్పటికీ, మనం తెలుసుకోలేమనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. దేవుని జ్ఞానం, చిత్తం మన పరిమితమైన మనస్సులకు, హృదయాలకు ఎంతగానో అతీతమైనవి కనుక వాటి మర్మాన్ని మనం ఎన్నటికీ అర్థం చేసుకోలేము. జీవితం ఒక మర్మం. పోరాటం, కష్టం మర్మాలే. ప్రేమ ఒక మర్మం. అయినప్పటికీ, జీవితంలోని లెక్కలేనన్ని మర్మాలను వినయంతో ఎదుర్కొంటున్నప్పుడు, మనం దేవుని అవగాహనకు అందని మర్మాన్ని కూడా ఎదుర్కొంటాం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనకు తెలియదని తెలుసుకోవడం, మనం అర్థం చేసుకోలేమని అర్థం చేసుకోవడం దేవుని మహా మర్మాన్ని మన ముందుంచుతాయి. అవగాహనకు అందని ఈ మర్మం ఎదుట ఉన్నప్పుడు, మనం దేవుని సన్నిధిలో ఉంటాం. ఇది ఒక వరం! దేవుని మర్మం ముందు మన అవగాహన ఇలా మౌనం దాల్చడం, జీవితాన్ని విశ్వాసంతో ఎదుర్కోవడానికి మనకు తోడ్పడుతుంది. విశ్వాసం అనేది పూర్తిగా అర్థం చేసుకోకుండానే తెలుసుకునే ఒక మార్గం. అంధకారంలో ఉన్నప్పటికీ, స్పష్టతతోను నిశ్చయతతోను జీవితయాత్ర సాగించడానికి మనకు తోడ్పడే వరం అది (చూడండి డైరీ #651).
దేవుడు గానీ ఆయన మార్గాలు గానీ మీకు అర్థం కావడం లేదని అనిపిస్తోందా? మీ జీవితాన్ని చూసుకుని, “ఇది ఎందుకు?” లేదా “అది ఎందుకు?” లేదా “వీటన్నిటిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు?” అని ఆలోచిస్తున్నారా? దేవుడు, ఆయన మార్గాలు ఒక మర్మం. అయితే, అది మర్మం కనుక, విశ్వాసపు అంధకారంలో దానిలోకి ప్రవేశించమని మీకు ఆహ్వానం అందుతోంది. పవిత్రాత్మ మీ ఆలోచనలలోకి చొచ్చుకుపోయి, మీకు ఒక కొత్త రీతిలో బోధించడానికి మీరు అనుమతిస్తేనే ఇది అర్థవంతమవుతుంది. దేవుని మనస్సును, చిత్తాన్ని గురించిన మీ “అవగాహన” ఇతర జ్ఞానరూపాల వలె ఉండదు; బదులుగా, మీ జ్ఞానం కొత్తదిగా, నిశ్చయమైనదిగా, స్పష్టమైనదిగా, లోతైనదిగా ఉంటూనే మర్మభరితంగా కూడా ఉంటుంది. విశ్వాసం ద్వారా బోధన పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అప్పుడు జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి మర్మాన్ని, ప్రతి కష్టాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు.
ప్రభువా, ఓ అవగాహనకు అందని మర్మమా! సంభ్రమంతో, అంధకారంలో నీ ఎదుట నిలుస్తున్నాను. అయినా నా అవగాహనలోని అంధకారంలో, నీపై నా విశ్వాసాన్ని, నమ్మకాన్ని మళ్లీ దృఢపరచుకుంటున్నాను. నా జీవిత మర్మాన్ని, అంతకన్నా ఎక్కువగా నీ జీవిత మర్మాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, విశ్వాస వరంతో నన్ను పూర్తిగా ఆవరించడానికి నిన్ను అనుమతిస్తున్నాను. చూడకుండానే విశ్వసించడానికి, అర్థం చేసుకోకుండానే తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. అన్నిటికన్నా ముఖ్యంగా, ఓ అవగాహనకు అందని మర్మమా, నా జీవితాన్ని నీకు సమర్పించాలని కోరుకుంటున్నాను, అలా చేయాలని నిర్ణయించుకుంటున్నాను; మిగిలిన అన్నిటికన్నా నిన్నే ఎంచుకుంటున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మే 12 –
పునీత నెరేయుస్, పునీత అఖిల్లేయుస్, వేదసాక్షులు
పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




