శ్రమలనుభవించే విమోచకునిగా క్రీస్తు, చిత్రించినవారు ఆండ్రేయా మాంటెన్యా
ఆంగ్లంలో వినండి
సువార్తలతో పరిచయమున్న మనలో కొన్నిసార్లు క్రీస్తు శ్రమల పట్ల ఒక రకమైన ఉదాసీనత కలగవచ్చు. ప్రతి సంవత్సరం ఆ వృత్తాంతం చదువుతుంటే మనం వింటాము; ఆయన శ్రమలను చూపించే ఎన్నో చిత్రాలను చూశాము. ఇలా సుపరిచితమైపోవడం వల్ల, అది మన జీవితాలపై తగిన ప్రభావం చూపేందుకు మనం అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన శ్రమలు వాస్తవమైనవి, అవి నిజంగా జరిగాయి; మనం వాటిపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఒక స్థాయిలో వాటిని ధ్యానించడం మనకు ఆహ్లాదకరంగా అనిపించకపోయినా, అవి ఎంతో మర్మభరితమైన ప్రేమకార్యం. మన జీవితాల్లో వాటి అర్థాన్ని, ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడానికి మనకు ఎంతో కృప అవసరం. ప్రతి కొరడా దెబ్బ, ప్రతి అపహాస్యం, ప్రతి మేకు, ప్రతి ముల్లు మన ప్రభువు శరీరాన్ని గాయపరచడమే కాక, ఆయన ఆత్మకు కూడా భరించలేని వేదనను కలిగించాయి. అయినా ఆయన తాను భరించిన ప్రతి బాధను తన హృదయంలోకి తీసుకొని, అందరి రక్షణ కోసం తండ్రికి అర్పిస్తూ దానిని విమోచించారు. మన విశ్వాసంలోని ఈ గొప్ప మర్మాన్ని మనం దర్శించి, భక్తివిస్మయంతోను, పవిత్రమైన ఆశ్చర్యంతోను దానిని తేరి చూడాలి (చూడండి దినచర్య #948).
శ్రమలనుభవిస్తున్న యేసును మీరు తేరి చూశారా? ఆయన నొప్పిని, బాధను చూడటానికి మీ హృదయాన్ని తెరిచారా? ఆయన అన్నిటినీ మౌనంగా, అంగీకారభావంతో భరించడాన్ని మీరు చూశారా? మన విశ్వాసంలోని ఈ అద్భుతమైన మర్మాన్ని ఈ రోజు ధ్యానించండి. మీ కోసం ఇంతగా బాధలనుభవించిన ఆయన పట్ల ప్రేమలోను, సానుభూతిలోను ఎదగడానికి మీ హృదయాన్ని తెరవండి. ఆయన శ్రమలు పాపపు ప్రభావాలను నిర్మూలించి, బాధనే ఆయన దైవకారుణ్య సాధనంగా మార్చాయని తెలుసుకోండి.
ప్రియాతిప్రియమైన ప్రభువా, నీ శ్రమలకై నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ కార్యంలో నీవు మానవ బాధను నీ మహిమాన్వితమైన ఆత్మలోకి తీసుకొని దానిని విమోచించావు. నా పాపపు ప్రభావాలను నీవు భరించావు, ఒక్క మాట కూడా పలకలేదు. ప్రభువా, నా పాపాలకు నీవు వెల చెల్లించావు; పరిపూర్ణమైన ప్రేమతోను, దృఢసంకల్పంతోను అలా చేశావు. ప్రియ ప్రభువా, నేను అనుభవించే బాధలన్నిటినీ స్వీకరించి, వాటిని నీ పవిత్ర సిలువ విమోచన శక్తితో ఐక్యం చేసే కృపను నాకు దయచేయి. ఆ ఐక్యతలో నా పాపాల నుండి నన్ను విముక్తి చేసి, నీ కారుణ్య సమృద్ధిని నాపై కుమ్మరించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూన్ 29 – అపొస్తలులైన పునీత పేతురు, పౌలుల మహోత్సవం
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




