తెలుగు

ధ్యానం 190: సృష్టి అంతా దేవునికి మహిమను చెల్లిస్తుంది

లిన్ గ్రేలింగ్ రూపొందించిన “సూర్యకాంతిలో ఉదయశోభ”

వీడియో

ఆంగ్లంలో వినండి

సమస్తమూ ఒకే పరమ లక్ష్యం కోసం సృష్టించబడ్డాయి: అతి పవిత్ర త్రిత్వానికి స్తుతిని, మహిమను చెల్లించడానికి.  మనం సృష్టించబడింది ఈ లక్ష్యం కంటే ఎక్కువైన దేనికోసమో, తక్కువైన దేనికోసమో, దీనికి భిన్నమైన దేనికోసమో కాదు.  మానవులుగా మనం, పూర్తిగా ఆయనకే అంకితమై, ఆయనకు సమర్పించుకున్న జీవితాల ద్వారా మన ఆరాధనలోని విశిష్టమైన స్తుతిని, మహిమను దేవునికి చెల్లించడానికి పిలువబడ్డాం.  ఈ సమర్పణ, మన బుద్ధినీ చిత్తాన్నీ పూర్తిగా ఆయనకు లోబరచుకోవడం ఆయన నామానికి తగిన స్తుతిని దేవునికి అర్పిస్తాయి.  అయితే సృష్టి అంతా ఆయన పరిపూర్ణ క్రమాన్ని, ముఖ్యంగా ఆయన పరిపూర్ణ కారుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి, సృష్టి అంతా దేవుని మహిమలో పాలుపంచుకుంటుంది.  ఉదాహరణకు, ఆకాశ పక్షులను, సముద్ర జీవులను, భూమిపై ఉన్న సమస్త ప్రాణులను సంరక్షించడంలో దేవుడు కనబరిచే దైవపరిపాలన ఆయన మహిమను వెల్లడిస్తుంది; అవి తమ ఉనికి ద్వారానే ఆయనకు మహిమను చెల్లిస్తాయి.  మనం దీనిని చూసి, ఇందులో ఆనందించి, సమస్తాన్నీ ఉనికిలో నిలిపి ఉంచే ఆయన కారుణ్యానికై దేవునికి మహిమను చెల్లించాలి (చూడండి దినచర్య #1005).

సృష్టి అంతటిలో వ్యక్తమవుతున్న దేవుని కారుణ్యాన్ని మీరు గుర్తిస్తున్నారా?  మన పాపాల క్షమాపణ ద్వారా, తన జీవంలో పాలుపంచుకోమని ఆయన మనకు ఇచ్చే ఆహ్వానం ద్వారా మనకు లభించే ఆయన కారుణ్యాన్ని గుర్తించడం మరింత సులభంగా ఉండవచ్చు.  అయితే సృష్టిలోని పరిపూర్ణ క్రమాన్ని కూడా మనం చూడాలి; ఆ క్రమంలో, ఆయన తన దైవపరిపాలనలో సృష్టి పట్ల చూపే శ్రద్ధను గొప్ప కారుణ్య కార్యంగా గుర్తించాలి.  ఈ రోజు సృష్టిని గురించి ధ్యానించండి.  పువ్వులు, తేనెటీగలు, జంతువులు, భౌతిక ప్రపంచ రూపకల్పనలోని చిన్నచిన్న వివరాలన్నిటినీ గురించి ఆలోచించండి.  ఇది నిజంగా అద్భుతమైనది, రహస్యమయమైనది; పరిపూర్ణ జ్ఞానం, ప్రేమ కలిగిన దేవుణ్ణి వెల్లడిస్తుంది.  సృష్టి దేవుని కారుణ్యాన్ని శక్తిమంతంగా వెల్లడిస్తుంది.

ప్రభువా, ఈ లోకంలో నీవు చేసిన సమస్తానికై నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ఈ లోకాన్ని రూపొందించి, సృష్టించి, నీ దైవపరిపాలనకు అనుగుణంగా సమస్తాన్నీ ఉనికిలో నిలిపి ఉంచుతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  నీవు సృష్టించిన సమస్తంలో నీ కారుణ్య హృదయాన్ని నేను కనుగొని, ఈ వరం ద్వారా నీపట్ల నా విస్మయాదరాలు పెంపొందించుకొందును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 9 – పవిత్ర అగస్టిన్ జావో రోంగ్ మరియు సహచరులు, వేదసాక్షులు

 

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు