వీడియో ఆంగ్లంలో వినండి
లోకంలోని ప్రతి ఇసుక రేణువును లెక్కించే పని మీకు అప్పగించబడిందని ఊహించుకోండి. అది అసాధ్యమైన పని అని స్పష్టమే. నిజానికి, లోకంలోని ప్రజలందరూ కలిసి కూడా అలాంటి పనిని పూర్తిచేయలేరు. కొన్ని విషయాలు మన శక్తికి మించినవి. అంతకంటే కూడా కష్టమైన మరో పని దేవుని కారుణ్యాన్ని పూర్తిగా గ్రహించడం. ఇది అసాధ్యం. దేవుని కారుణ్యం మన అవగాహనకు పూర్తిగా అతీతమైనది. దాని లోతు, విస్తృతి అనంతమైనవి. మీరు మీ జీవితమంతా దేవుని కారుణ్యాన్ని ధ్యానిస్తూ, అనుభవిస్తూ గడిపినా, దాని ఉపరితలాన్ని దాటి లోనికి ప్రవేశించడం అప్పుడే ప్రారంభిస్తారు. నిజానికి, ఇప్పటివరకు సృష్టించబడిన ప్రతి వ్యక్తీ నిత్యకాలమంతా దేవుని కారుణ్యాన్ని ధ్యానిస్తూ గడిపినా, మనందరి సమష్టి కృషి కూడా దానిని గ్రహించడానికి సరిపోదు. దేవుని కారుణ్యం అనంతమైనదని అర్థం చేసుకోవడం వల్ల, మన పోరాటం ఏదైనా, మన పాపం ఏదైనా, మన ఆత్మ శక్తులన్నిటితో ఆయనపై నమ్మకం ఉంచి ఆయన వైపు తిరగగలుగుతాము (చూడండి దినచర్య #1059).
దేవుని కారుణ్యాన్ని గ్రహించడానికి మీరు ప్రయత్నించారా? ఈ అనంతమైన వరాన్ని మీరు ఎన్నటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరనే విషయమైనా మీకు అర్థమైందా? మన ప్రభువుపై నమ్మకం ఉంచాలంటే, అసాధ్యమైన ఈ దైవధ్యాన కార్యాన్ని మీరు ప్రారంభించాలి. పరలోకంలో మీరు నిత్యమూ చేసేది ఇదే. మీ పరలోక జీవితం ఇప్పుడే ప్రారంభం కావాలి. ఇలా చేయడం వల్ల నమ్మకం ఉంచే మీ సామర్థ్యం మరింత పెరుగుతుంది; మీ నమ్మకం మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకునేలా చేస్తుంది. వేచి ఉండకండి, ఈ మహిమాన్వితమైన కార్యాన్ని నేడే ప్రారంభించండి.
కారుణ్య ప్రభువా, నీ ప్రేమ అనంతమైనది అయినందుకు, అగాధమైన ఈ రహస్యంలోకి నా ప్రయాణాన్ని ప్రారంభించమని నన్ను పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను నీ కారుణ్యంలో మునిగిపోవడం ప్రారంభించి, తద్వారా నేడు నీపై నాకున్న నమ్మకాన్ని మరింత పెంచుకునేలా, నా కన్నులు తెరవడానికి నాకు కృపను ప్రసాదించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూలై 22 – పునీత మగ్దలేనా మరియ పండుగ
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు





