తెలుగు

ధ్యానం 151: ఆధ్యాత్మిక బాంధవ్యం

పునీత బెనెడిక్టుతో పునీత స్కొలాస్తికా ద్వారా: లారెన్స్ ఓపీ, లైసెన్స్ CC BY-NC-ND 2.0.

వీడియో

ఆంగ్లంలో వినండి

మరొకరికి నిజంగా సన్నిహితంగా ఉండటానికి, వారిని లోతుగా అర్థం చేసుకోవడానికి, నిరంతరం మాట్లాడుతూ మీ మనసులోని, హృదయంలోని ప్రతి విషయాన్నీ పంచుకోవడం అవసరమా?  ఆ రెండు ఆత్మలూ దేవునితో గాఢంగా ఐక్యమై ఉంటే, అవసరం లేదు.  అప్పుడు, తమ మధ్య ఉన్న ఐక్యతను గుర్తించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చాలా కొద్దిగా మాట్లాడితే చాలు.  ప్రతి వ్యక్తిలో దేవుడు సజీవంగా ఉన్నప్పుడు, ఆయన సాన్నిధ్యమే వారిని ఐక్యపరచి, ఒకరినొకరు తెలుసుకునేలా చేస్తుంది.  దీనివల్ల ఆధ్యాత్మిక బాంధవ్యమనే దీవెన లభిస్తుంది. మరే విధంగానూ, ఎన్నో సంవత్సరాలపాటు నిరంతరం మాట్లాడుకుంటూ విషయాలను పంచుకున్నా కూడా, ఈ దీవెనను పొందలేము.  దేవుని గురించి ఇద్దరికీ ఉన్న పరిజ్ఞానం నుంచి కలిగే ఐక్యత, అందమైన స్నేహాన్ని ఏర్పరచడంలో మరే ఇతర మార్గం కంటే ఎంతో శ్రేష్ఠమైనది, ఎంతో ప్రభావవంతమైనది (చూడండి దినచర్య #768).

మీ స్నేహాల గురించి ఆలోచించండి.  ఆ సంబంధాలకు ఆధారం ఏమిటి?  మీ విశ్వాస జీవితం, దేవునిపట్ల మీ ప్రేమ మీ స్నేహాలకు పునాదిగా ఉన్నాయని ఆశిస్తున్నాము.  మీ స్నేహితులతో మీ విశ్వాసం గురించి ఎంత సులభంగా మాట్లాడగలుగుతున్నారో ధ్యానించండి.  అందరికీ స్నేహాన్ని, ప్రేమను అందించడం మంచిదే అయినా, మీరు ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని పంచుకోగలవారిని వెదకడం కూడా మేలు చేస్తుంది.  ఇంత గాఢమైన ప్రేమను, ఆధ్యాత్మిక స్నేహాన్ని మీరు పంచుకోగల ఇతరులవైపు మిమ్మల్ని నడిపించేందుకు పవిత్రాత్మను అనుమతించండి. వారి ద్వారా ప్రభువు తన అపారమైన కారుణ్యంతో మిమ్మల్ని దీవిస్తారు.

ప్రభువా, నీపై దృఢమైన విశ్వాసం కలిగిన వ్యక్తులను నా జీవితంలో వరంగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  ఆ స్నేహాలపై ఆధారపడటానికి, వాటిలో నీ కారుణ్య హృదయాన్ని కనుగొనటానికి నాకు సహాయం చేయి.  నా జీవితంలో నీవు ఉంచిన వారందరికీ నీ కారుణ్యాన్ని అందించే సాధనంగా ఉండటానికి కూడా నాకు సహాయం చేయి.  ప్రభువా, నీవే నాకు అత్యంత సన్నిహిత మిత్రుడవు. నీ స్నేహమనే ఈ అమూల్యమైన వరానికి, నాపై నీకున్న ప్రేమకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మే 31 – అతి పరిశుద్ధ త్రిత్వ మహోత్సవం

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు