తెలుగు

ధ్యానం 161: మీకు అనుగ్రహించబడిన అనన్యమైన ప్రేమ

పునీత పేతురు విముక్తి — బార్తొలోమే ఎస్తెబాన్ మురియ్యో చిత్రణ

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవుని ప్రేమను, కారుణ్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆయన ప్రేమ ప్రజలందరికీ ఒకే విధంగా సమానంగా పంచిపెట్టబడేదన్నట్లుగా, దానిని సాధారణమైనదిగా భావించే అవకాశం ఉంది.  కానీ మీపై దేవునికి ఉన్న ప్రేమ, ప్రజలందరికీ ఇచ్చే ఒక సాధారణ వరం కంటే ఎంతో గొప్పది.  అది ఎంతో వ్యక్తిగతమైనది, అనన్యమైనది; మీపై ప్రేమతో ప్రత్యేకంగా మీకే అందించబడుతోంది.  దేవుడు మిమ్మల్ని అనేకమందిలో ఒకరిగా చూడరు; బదులుగా, తన ప్రేమను ప్రత్యేకంగా మీపై కేంద్రీకరిస్తారు.  ప్రతి ఒక్కరినీ దేవుడు ఈ అనన్యమైన, ప్రత్యేకమైన రీతిలో ప్రేమిస్తారు.  అందువల్ల, తన ప్రాణాన్ని అర్పించేంతగా ప్రేమించే తన ఏకైక అమూల్యమైన బిడ్డగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.  దేవుడు మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నారని తెలుసుకోండి.  మీ జీవితంలోని ప్రతి వివరమూ ఆయనకు తెలుసు; ఆయన తన కృపను మీపై కుమ్మరిస్తారు (చూడండి: డైరీ #824).

దేవునికి మీపై ఉన్న ప్రత్యేకమైన, అనన్యమైన ప్రేమ గురించి మీకు ఎంతవరకు తెలుసు?  కారుణ్యంతో జ్వలించే ఆయన హృదయం మిమ్మల్ని ప్రేమిస్తోంది కాబట్టి, ఆయన ప్రేమ మీకు వ్యక్తిగతమైనది.  ప్రతి ఒక్కరినీ తన అమూల్యమైన బిడ్డగా చూస్తూ, వారి ప్రత్యేకతలోనూ, వారు పాపాల్లో ఉన్నప్పటికీ వారిని ప్రేమిస్తూ, ప్రతి వ్యక్తినీ ఈ విధంగా ప్రేమించగల సంపూర్ణ సామర్థ్యం దేవునికి ఉంది.  ఈ రోజు మీ జీవితంలో దేవుని ఈ వ్యక్తిగతమైన, సమృద్ధియైన ప్రేమను అనుభవించడానికి మనసు తెరవండి.  అది అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని నిలబెట్టి, మీరు అన్నిటికన్నా మిన్నగా ప్రేమించబడుతున్నారని ఎల్లప్పుడూ తెలుసుకునేందుకు సహాయపడుతుంది.

ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను; పరిపూర్ణమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  నీ అమూల్యమైన బిడ్డగా నాకు అందిస్తున్న నీ ప్రత్యేకమైన ప్రేమవరాన్ని స్వీకరించడానికి నాకు సహాయం చేయి.  నీవే నా ఏకైక ప్రభువువనీ, దేవుడవనీ అంగీకరించడం ద్వారా నీ ప్రేమకు ప్రతిగా నిన్ను ప్రేమించగలుగుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

దివ్యహృదయ నవదిన ప్రార్థన
సూచించిన నవదిన ప్రార్థన తేదీలు: జూన్ 3 – 11, 2026
అతి పవిత్ర దివ్యహృదయ మహోత్సవం జూన్ 12, 2026న జరుగుతుంది

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు