చిత్రం pxfuel ద్వారా
ఆంగ్లంలో వినండి
మీ జీవితపు అంతిమ లక్ష్యం ప్రేమ. మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే, ముందుగా దేవుణ్ణి నిర్మలమైన ప్రేమతో ప్రేమించడం. ప్రేమ నిర్మలంగా ఉండాలంటే, అది సమస్త స్వార్థం నుండి విముక్తి పొందాలి. నిర్మలమైన ప్రేమ తాను ప్రేమించే వారిపైనే దృష్టి పెడుతుంది. మనం దేవుణ్ణి నిర్మలమైన ప్రేమతో ప్రేమించినప్పుడు, ఆయన మహిమాన్వితుడు, మన ప్రేమకు అర్హుడు కాబట్టి, ఆయనను ప్రేమించడం యుక్తమైనది, న్యాయమైనది కాబట్టి, ఆయన కోసమే ఆయనవైపు ఆకర్షితులవుతున్నామని గ్రహిస్తాము. నిస్వార్థంగా, దేవుని మహిమపైనా సౌందర్యంపైనా మాత్రమే దృష్టి నిలిపి మనం ఈ విధంగా ప్రేమించగలిగినప్పుడు, ఎంతో మహిమాన్వితమైన మరొక విషయాన్ని కూడా కనుగొంటాము. దేవునిపట్ల మనకున్న నిర్మలమైన ప్రేమ ఫలితంగా, మరే ప్రతిఫలమూ అవసరం లేనంత సమృద్ధిగల, శక్తిమంతమైన ఆనందంతో కూడా మనం నిండిపోతున్నామని తెలుసుకుంటాము. దేవుణ్ణి నిర్మలమైన ప్రేమతో ప్రేమించడం వల్ల మనలో నిండే ఆనందం ఎంత ప్రబలమవుతుందంటే, అది పొంగిపొరలి ఇతరులపట్ల గాఢమైన, నిజాయితీగల ప్రేమగా ప్రవహిస్తుంది. జీవితంలో ఇదే అత్యంత గొప్ప తృప్తి. కొలమానాలకు అందనంత సంతోషంగా ఉండటానికి మనకు నిజంగా మరేమీ అవసరం లేదు (చూడండి డైరీ #576).
మీరు సంతోషంగా ఉన్నారా? లేకపోతే, మీ సంతోషలేమికి దేనిని నిందిస్తున్నారు? ఏదో ఒకదాన్ని చూపించి నిందించడం సులభమే. అయితే, నిర్మలమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలని మనం ఎంచుకున్నప్పుడే సంతోషం కలుగుతుందని మనం గ్రహించాలి. మీ జీవితంలో మీరు దీనిని అనుభవిస్తున్నారా అని ఆలోచించండి. దేవునిపట్ల మీకున్న ప్రేమానురాగాలను ధ్యానించండి. ఈ ప్రేమ ఎంత బలంగా లేదా ఎంత బలహీనంగా ఉందో ఆలోచించండి. మీరు దేవుణ్ణి నిర్మలంగా, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తే, ఈ ప్రేమ మీ జీవితాన్ని ఎంత పరిపూర్ణంగా క్రమబద్ధం చేస్తుందంటే, మీరు అనుభవించే ఆనందం మరే ఇతర లౌకిక ఓదార్పుకంటే ఎక్కువగా మీకు తృప్తినిస్తుందని గుర్తుచేసుకోండి. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే, సంపూర్ణమైన, నిర్మలమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమించడానికి కృషిచేయండి.
ప్రభువా, నీపట్ల నాకున్న ప్రేమ పరిపూర్ణతకు ఎంతో దూరంగా ఉందని నాకు తెలుసు. నీవు నా సంపూర్ణ ప్రేమకు నిజంగా అర్హుడవు కాబట్టి, అన్నిటికంటే ఎక్కువగా, నీ కోసమే నిన్ను ప్రేమించగలిగేలా నీపట్ల నా ప్రేమ శుద్ధి పొందుటకు, ఈ రోజు నా చూపును, హృదయాన్ని మరింత సంపూర్ణంగా నీవైపు తిప్పడానికి నాకు సహాయం చేయి. నిన్ను ప్రేమించడంవల్ల కలిగే ఆనందానికి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ప్రేమలో నేను పరిపూర్ణమైన తృప్తిని, సంతోషాన్ని పొందేంత సమృద్ధిగా ఆ ఆనందం పొంగిపొరలుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఏప్రిల్ 30 – పునీత ఐదవ పయస్ పాపుగారు
పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




