తెలుగు

ధ్యానం 145: ప్రేమ పట్ల విస్మయంలో లీనమవడం

పునీత పౌలు దివ్యపారవశ్యం — చిత్రకారుడు: నికోలస్ పూస్సిన్

వీడియో

ఆంగ్లంలో వినండి

ప్రేమలో పడటం ఒకరిని “మంత్రముగ్ధులను” చేయవచ్చు.  ఈ విధమైన మానవ ప్రేమ కొంతవరకు మిమ్మల్ని మాటలు రాకుండా చేయవచ్చు; మీ అనుభూతిని కచ్చితంగా వ్యక్తపరచడం అవసరమని గానీ, అసలు సాధ్యమని గానీ మీకు అనిపించకపోవచ్చు.  కానీ దేవుని ప్రేమ మానవ ప్రేమకు సంబంధించిన ఏ అనుభవానికైనా అతీతమైనది. అందువల్ల, దానిని గాఢంగా అనుభవించినప్పుడు, మీరు ప్రేమించే దేవుని పట్ల భక్తివిస్మయాలతో మౌనంగా కూర్చుండిపోతారు.  మీరు ప్రేమించడానికి ఆకర్షితులైన దేవుని మహిమావైభవాలను చూసి మీలో కలిగే అబ్బురాన్ని, ఆశ్చర్యాన్ని ఏ మాటలూ పూర్తిగా వర్ణించలేవు, వ్యక్తపరచలేవు.  మరే విధంగానైనా మీరు మాటల్లో చెప్పగలిగే దానికంటే మీ మౌనం, భక్తివిస్మయం ఎంతో ఎక్కువగా తెలియజేస్తాయి (చూడండి దినచర్య #729).

మీరు ప్రేమలో పడ్డారా?  మరింత స్పష్టంగా చెప్పాలంటే, మీరు మీ దేవుని ప్రేమలో పడ్డారా?  దేవుని విషయంలో “ప్రేమలో పడటం” అంటే కేవలం మానవ సహజమైన తపన లేదా భావోద్వేగం మాత్రమే కాదు; అది మీ ఆత్మను పూర్తిగా ఆవరించి, ఆయన సన్నిధిలో మీకు తృప్తినిచ్చే ఆధ్యాత్మిక ఆకాంక్ష.  జీవితంలో పరిపూర్ణతను పొందడానికి దేవునితో ఈ ఆధ్యాత్మిక ఐక్యతను అనుభవించడం ఒక్కటే మీకు అవసరం. అదే మీ జీవితంలోని ప్రతి పనికీ మూలమవుతుంది; ఎందుకంటే మీ కార్యాలన్నీ మీ ప్రియతముడైన దేవుని ప్రేమించడం వైపు మాత్రమే మళ్లుతాయి.  దేవుని పట్ల మీ ప్రేమ ఎంత లోతైనదో ధ్యానించండి. ఈ ప్రేమ మీ జీవితంలో సజీవంగా కనిపించకపోతే, మీరు దానిని కోరుకుంటున్నారని ప్రభువుతో చెప్పి, మీ శక్తినంతా వినియోగించి ఆయనను వెదకండి.

ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నీ ప్రేమను పొందాలని కోరుకుంటున్నాను.  నా ప్రేమ పరిపూర్ణతకు ఎంతో దూరంగా ఉందని నాకు తెలుసు.  ప్రభువా, మరింత సన్నిహితంగా నిన్ను వెదకడానికి, అత్యంత ఆంతరంగికంగా నిన్ను కలుసుకోవడానికి నాకు సహాయం చేయుము.  నా ఆత్మ నీ కోసం తపనతో నిండిపోవుగాక; నేను నిన్ను కలుసుకున్నప్పుడు నీ మహిమావైభవాలను తిలకించుదును గాక.  నా దేవా, నీ పట్ల నాకున్న ప్రగాఢమైన విస్మయంలో నేను నిజంగా “లీనమైపోవుదును” గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మే 25 – సభమాతయైన ధన్య కన్య మరియ జ్ఞాపకార్థ దినం

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు