తెలుగు

ధ్యానం 183: బాధల విలువను గుర్తించడంలో శ్రద్ధ

పునీత లారెన్స్ వేదసాక్షి మరణం, చిత్రణ: లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0.

వీడియో

ఆంగ్లంలో వినండి

మనం బాధపడుతున్నప్పుడు, వాటి నుండి బయటపడే మార్గం కోసం చూస్తాం.  ఉపశమనం కోరుకుంటాం.  అయితే పరలోకం నుండి మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు, స్వేచ్ఛగా ఎంచుకొని స్వీకరించిన బాధల అపారమైన శక్తిని చూడగలుగుతాం.  బాధ దానికదే మంచిదని కాదు; బదులుగా, క్రీస్తు బాధల ఫలితంగా బాధ విమోచింపబడి, దేవునిచే ఆధ్యాత్మిక శక్తిని పొందిందని అర్థం.  కాబట్టి, మీరు ప్రభువుపై నమ్మకం ఉంచితే, మీరు స్వేచ్ఛగా స్వీకరించిన బాధల గొప్ప విలువను ఇక్కడే, ఇప్పుడే మీకు వెల్లడించడానికి ఆయనను అనుమతించండి.  మీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని స్వీకరించడం ద్వారా, కృప ద్వారానే అర్థం చేసుకోగల ఒక అర్పణను మీరు దేవునికి సమర్పిస్తారు.  ఇది లోకానికి అర్థం కాదు; కానీ ఇది కారుణ్యానికి శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. దాని ద్వారా ప్రభువు మీకు గొప్ప కార్యాలు చేస్తాడు; మీ ద్వారా తన కృపతో లోకాన్ని నింపుతాడు.  దేవునిపై దృఢమైన నమ్మకంతో చేసే ప్రార్థనలో ఆయనకు అర్పించిన మీ అంతరంగ బాధల విమోచన అనే ఈ పవిత్ర వరాన్ని గుర్తించడానికి పరలోకం చేరేవరకు వేచి ఉండకండి (చూడండి డైరీ #963).

మీ బాధలను క్రీస్తు బాధలతో స్వేచ్ఛగా ఏకం చేసినప్పుడు వాటికి ఉండే శక్తి మీకు తెలుసా?  ఇది మీకు అర్థమవుతోందా?  ఈ అవగాహన కృప ద్వారానే సాధ్యమవుతుంది; అదే కృప ద్వారానే దానిని హృదయపూర్వకంగా స్వీకరించగలం.  ఈ రోజు, మీరు అంతరంగంలో అనుభవిస్తున్న బాధల గురించి ధ్యానించండి; వాటి నుండి వెనుకంజ వేయకండి.  వాటిని ఎదుర్కోండి, స్వీకరించండి, ప్రేమించండి.  ఎందుకంటే ఆ పవిత్రమైన స్వీకారంలో దేవుడు మీ జీవితంలోనూ, మీ జీవితం ద్వారానూ అద్భుతంగా కార్యం చేస్తాడు.

ప్రభూ, నా ఆత్మలో నేను అనుభవించే బాధలన్నిటి విలువను శ్రద్ధగా గుర్తించేలా చేయుము.  దీనిని నీ దైవకారుణ్య వరంగా చూడటానికి నాకు సహాయం చేయుము.  ఈ పవిత్ర వరంలోని శక్తిని నేను గుర్తించడం లేదనే వాస్తవాన్ని అంగీకరిస్తున్నాను.  నా బాధలను నీవు చూసినట్లుగా చూడటానికి నీ దృష్టిని, వాటిని పవిత్రంగా స్వీకరించడానికి నీ చిత్తాన్ని నాకు ప్రసాదించుము.  ప్రియమైన ప్రభూ, ఈ రోజు ఈ అర్పణను నీకు సమర్పిస్తున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు