తెలుగు

ధ్యానం 184: యాజకుల పరిచర్యలోని కారుణ్యం

మాథాకు చెందిన పునీత యోహాను గురుపట్టాభిషేకం మరియు తొలి దివ్యబలిపూజ, చిత్రకారుడు విసెంటే కార్దూచో

వీడియో

ఆంగ్లంలో వినండి

లేదు, యాజకులు పరిపూర్ణులు కారు.  వారు ప్రతిరోజూ పాపం చేస్తారు.  మిగిలిన మానవులందరిలాగే వారి దైనందిన జీవితాల్లోనూ నిరంతరం పశ్చాత్తాపం, హృదయపరివర్తన అవసరం.  అయినప్పటికీ వారు యాజకులు.  వారి పవిత్ర గురుపట్టాభిషేకం కారణంగా, ప్రభువు వారి ద్వారా స్పష్టమైన, అయినా రహస్యమైన రీతిలో మాట్లాడతాడు.  కొందరు దివ్యబలిపూజలో ప్రతిష్ఠీకరణ వచనాలను లేదా సయోధ్య సంస్కారంలో పాపవిమోచన వచనాలను పలికేటప్పుడు మాత్రమే క్రీస్తు అధికారంతో మాట్లాడతారు.  మరికొందరు తమ గురుపట్టాభిషేకం ద్వారా పొందిన ప్రత్యేక ఆధ్యాత్మిక వరాన్ని స్వీకరించి జీవిస్తారు; వారి బోధనల ద్వారా, పవిత్ర జీవనం ద్వారా, తమ మందకు అందించే సలహా మాటల ద్వారా దేవుడు వారిని మరెన్నో విధాలుగా ఉపయోగించుకుంటాడు.  ఈ పవిత్ర యాజకులను వెదకండి.  వారి మాటలను వినండి, వారి ద్వారా మిమ్మల్ని నడిపించడానికి ప్రభువును అనుమతించండి.  ఎందుకంటే వారి ద్వారా పలికే దేవుని స్వరాన్ని వినడంలో మీరు సమృద్ధియైన కారుణ్యంతో ఆశీర్వదించబడతారు (చూడండి డైరీ #968).

దేవుడు మీ జీవితంలో ఉంచిన యాజకుల గురించి ఈ రోజు ప్రేమపూర్వకంగా ధ్యానించండి.  వారు మీ సొంత విచారణ యాజకులు కావచ్చు, రచనల ద్వారా మాట్లాడే యాజకులు కావచ్చు, లేదా ఆధునిక సమాచార మాధ్యమాలలో మరొకదాని ద్వారా మాట్లాడే యాజకులు కావచ్చు.  దేవుడు తన పవిత్ర యాజకులను మీకు చూపిస్తాడు; వారి ద్వారా నేరుగా మీతో మాట్లాడతాడు.  వారి మాటలను వినండి, ఎందుకంటే వారి మాటలను వినడంలో మీరు దేవుని కారుణ్యపు మాటలను వింటారు.

ప్రభువా, సంస్కారాల ద్వారా లోకంలో కొనసాగుతున్న నీ సాన్నిధ్యానికి చిహ్నంగా పవిత్ర యాజకత్వాన్ని స్థాపించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  యాజకులందరి కోసం, ముఖ్యంగా నా ఆధ్యాత్మిక సంరక్షణను నీవు ఎవరికి అప్పగించావో వారి కోసం ప్రార్థిస్తున్నాను.  వారి పవిత్ర పరిచర్యలో వారి ద్వారా మాట్లాడే నిన్ను స్వీకరించేందుకు నా హృదయం ఎల్లప్పుడూ తెరిచి ఉండునుగాక.  వారి పెదవుల ద్వారా పలికే నీ స్వరం వినిపించినప్పుడు సంపూర్ణ సమర్పణతో, ఉదారతతో నేను స్పందించుదును గాక. ప్రియమైన ప్రభువా, యాజకుల ద్వారా పలికే నీ స్వరాన్ని నేను ఎల్లప్పుడూ వినేలా నాకు వినయాన్ని ప్రసాదించు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 3 – పునీత తోమా అపొస్తలుని పండుగ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు