పునీత ఆంథోనీవారి రొట్టె, చిత్రకర్త: లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0.
వీడియో ఆంగ్లంలో వినండి
సుదూర దేశంలో తీవ్రమైన కరువు ఉందని మీకు తెలిసి, ఆ కరువును నివారించడానికి అపరిమిత వనరులు కూడా మీకు వరంగా లభించి ఉంటే, అవసరంలో ఉన్నవారికి ఈ వరాన్ని ఎందుకు అందించకుండా ఉంటారు? మీరు అలా చేయరనే ఆశిస్తున్నాము. మీ బాధ్యతను గుర్తించి, తీవ్ర అవసరంలో ఉన్నవారి దాహాన్ని, ఆకలిని తీర్చడానికి అవసరమైనది చేస్తారనే ఆశిస్తున్నాము. నిజానికి తీవ్రమైన కరువు ఉంది; ఈ కరువును నివారించడానికి మీకు అపరిమితమైన ఒక వనరు వరంగా లభించింది. ఆ కరువు దేవుని కారుణ్యం కోసం కలిగే ఆకలిదప్పులే. అయితే ఈ కారుణ్యం కోసం అలమటిస్తున్న చాలామందికి తాము వెదుకుతున్నది ఇదేనని తెలియదు. మీకు ఇవ్వబడిన అపరిమిత వనరు దేవుని కారుణ్యమే. తన కారుణ్యాన్ని పంచిపెట్టే పనిని ఆయన మీకు అప్పగించారు; మీకు ఏదీ ఇవ్వకుండా దాచుకోరు. ఈ కృపతో మీరు సహకరించడం ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతోందా? తన అపరిమిత కారుణ్యాన్ని ఇతరులకు అందించమనే దేవుని పిలుపుకు వెనుకాడకండి (చూడండి: డైరీ #975).
తన సంపదను పంచిపెట్టమని దేవుడు మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తున్నారు? దేవుని కారుణ్యానికి ఎవరూ అర్హులు కారు; అందుకే అది కారుణ్యం. అయితే ఈ కృపావిందంలో పాల్గొనమని ప్రతి ఒక్కరికీ ఆహ్వానం ఉంది. తన దైవకారుణ్యాన్ని పంచిపెట్టడానికి ప్రభువు మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఆయన చిత్తప్రకారం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి, మనస్ఫూర్తిగా అంగీకరిస్తే చాలు. మీరు మీ సొంత శక్తితో పనిచేయరు; దేవుడే మీ ద్వారా పనిచేస్తారు. అయితే మీరు అనుమతిస్తేనే ఆయన అలా చేయగలరు.
ప్రభువా, నీ దైవకారుణ్యమనే అపరిమిత వరం కోసం నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కృపను పంచిపెట్టడానికి నన్ను పిలిచినందుకు కూడా నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్ని విషయాలలో నీకు “అవును” అని చెప్పడానికి, నీవు నాకు అప్పగించిన బాధ్యతను స్వీకరించడానికి నాకు సహాయం చేయి. ప్రియ ప్రభువా, నీ చిత్తప్రకారం నన్ను ఉపయోగించుకో. తీవ్ర అవసరంలో ఉన్న లోకానికి నీ దైవకారుణ్యాన్ని ఉదారంగా పంచిపెట్టడానికి నాకు కావలసిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని దయచేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూలై 4 – స్వాతంత్ర్య దినోత్సవం—అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఐచ్ఛిక స్మరణ
పోర్చుగల్‌కు చెందిన పునీత ఎలిజబెత్—ఐచ్ఛిక స్మరణ
(అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జూలై 5న జరుపుకుంటారు)
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




