అల్కాంతారాకు చెందిన పునీత పేతురు పారవశ్యం, చిత్రకారుడు ఫ్రాన్చెస్కో ఫొంతెబాస్సో
ఆంగ్లంలో వినండి
“సౌందర్యం” చూసే వారి దృష్టిలోనే ఉంటుందని అంటారు. మరో మాటలో చెప్పాలంటే, సౌందర్యానికి నిర్వచనం ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడి ఉంటుందని కొందరు అంటారు. పైపైన చూసినప్పుడు ఇందులో కొంత నిజం ఉండవచ్చు; అయితే లోతుగా చూస్తే, నిజమైన సౌందర్యం దేవుని నుండి వస్తుంది, అన్ని విధాలా వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా ఉంటుంది. అది మన వ్యక్తిగత అభిరుచిపై ఆధారపడదు; దేవునిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా వస్తువు లేదా ఎవరైనా వ్యక్తి దేవుణ్ణి, ఆయన కారుణ్యాన్ని ఎంత ఎక్కువగా ప్రతిబింబిస్తే, అంత ఎక్కువ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. మన ఆత్మల విషయంలో ఇది తెలుసుకోవడం ముఖ్యం. ఇతరుల దృష్టిలో “సౌందర్యంతో” కనిపించాలని మనమందరం కోరుకుంటాము. అయితే పవిత్రమైన జీవితం ద్వారానే ఇది సాధ్యమని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతి వ్యక్తి సౌందర్యం విశిష్టమైనది. పరలోకంలో మనమందరం ఒకేలా ఉండము; ప్రతి వ్యక్తి ప్రత్యేకత, ఆ వ్యక్తికి మాత్రమే విశిష్టమైన రీతిలో దేవుని తేజస్సును ప్రకాశింపజేస్తుంది. మీరు ఆయన మహిమకు సాధనంగా ఉండేలా, దేవుని సౌందర్యం, వైభవం మీ జీవితం ద్వారా ప్రకాశించేందుకు కృషి చేయండి (చూడండి దినచర్య #1251).
మీరు సౌందర్యంతో ఉండాలని కోరుకుంటున్నారా? బహుశా పురుషులకంటే స్త్రీలు ఈ ప్రశ్నకు మరింత సులభంగా జవాబివ్వగలరేమో, ఎందుకంటే ఈ పదాన్ని స్త్రీల విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రశ్నను ధ్యానించండి. అలా చేస్తున్నప్పుడు, సౌందర్యాన్ని భిన్నమైన దృష్టితో చూడటానికి ప్రయత్నించండి. అత్యంత లోతైన అర్థంలో, సౌందర్యం అంటే సహజమైన శారీరక ఆకర్షణ కాదు. నిజమైన సౌందర్యం అంటే దేవుని మహిమలో పాలుపంచుకోవడం, పట్టకం గుండా కాంతి ప్రసరించినట్లుగా ఆ మహిమ మీ ఆత్మ ద్వారా ప్రకాశించనివ్వడం. దేవుని సౌందర్యం ఆయన కారుణ్యంతో ఇతరులను ఒక విశిష్టమైన, గాఢమైన రీతిలో ఆశీర్వదించేలా, దేవుడు మీ ద్వారా ప్రకాశించేందుకు కృషి చేయండి.
ప్రభువా, నీవే నా ఆత్మకు మహిమ, వైభవం. నీ సౌందర్యం విస్మయాన్ని కలిగించేది, అన్ని విధాలా తేజోవంతమైనది. నా జీవితంలో పరివర్తన కలిగించే నీ సౌందర్యాన్ని ఇతరులు చూసేలా, వచ్చి నాలో నివసించి, నా ద్వారా ప్రకాశించు. ప్రియమైన ప్రభువా, నీ మహిమకు సాధనంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




