తెలుగు

ధ్యానం 300: మీ ఆత్మ రహస్యాలను వెల్లడించడం

సందర్శనం, డొమెనికో గిర్లాండాయో చిత్రకృతి

వీడియో

ఆంగ్లంలో వినండి

మీ ఆత్మలోని లోతులను వెల్లడించగలిగే వ్యక్తి ఒకరు ఉండటం నిజంగా ఎంతో ఓదార్పునిస్తుంది.  సంపూర్ణ గోప్యతను కాపాడుతూ, కరుణతో మిమ్మల్ని అర్థం చేసుకునే అటువంటి నమ్మకమైన వ్యక్తి ఉండటం గొప్ప ఆశీర్వాదం.  మనం ఈ విషయాలను పంచుకునే వ్యక్తి పరిపూర్ణ ప్రేమతో స్పందించి, మీకు దేవుని కారుణ్యాన్ని అందించగలిగినప్పుడు, మీ పాపాలను సైతం సంకోచం లేకుండా చెప్పుకోవడం ఎంతో స్వస్థతను కలిగించగలదు.  మనందరికీ అలాంటి నమ్మకమైన వ్యక్తి అవసరం.  నిజానికి మనకు అలాంటి వ్యక్తి ఉన్నారు!  మహిమాన్వితమైన సయోధ్య సంస్కారంలో మన కోసం వేచి ఉన్న గురువు మనకు ఉన్నారు.  ఆయన గోప్యతను తప్పక కాపాడతారు, తన సానుభూతిని, కరుణను అందిస్తారు. మీ హృదయంలోని అత్యంత లోతైన, చీకటిమయమైన రహస్యాలపై దేవుని క్షమాపణ, కారుణ్యం కుమ్మరించబడతాయి.  పాపసంకీర్తనకు వెళ్లడానికి సంకోచించకండి, ఆలస్యం చేయకండి.  మన ప్రభువు అందించే ఈ వరం మీకు అవసరం. దీని ద్వారా ఆయన తన సమృద్ధియైన కారుణ్యంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు (చూడండి డైరీ #1464).

మీ హృదయంలోని అత్యంత లోతైన, “చీకటిమయమైన” పాపాన్ని గురించి నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోండి.  దేనిని బయటపెట్టడానికి మీరు ఎక్కువగా భయపడుతున్నారు?  ఆ చీకటిలోకి ప్రవేశించి, తన వెలుగు, కారుణ్యమనే స్వస్థత లేపనాన్ని అందించాలని ప్రభువు ఎంతో తపనతో కోరుకుంటున్నారు.  సయోధ్య సంస్కారం ద్వారా ఆయనను తప్పక లోనికి రానివ్వండి.  ఈ సంస్కారపు శక్తి సాటిలేనిది. మీ స్వస్థత ప్రారంభం కావడానికి, మీ భారాల నుండి విముక్తి పొందడానికి మీకు అవసరమైనది సరిగ్గా ఇదే.  దీనికి భయపడకండి, దీనిని వాయిదా వేయకండి.  ఈ మహిమాన్వితమైన సంస్కారంపై ఈరోజు విశ్వాసం ప్రకటించండి. అది మీ జీవితంపై చూపే ప్రభావాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు.

ప్రభువా, సయోధ్య సంస్కారంలో నా పాపాలను ఒప్పుకోవడానికి దయచేసి నాకు ధైర్యమును దయచేయుము.  ఇది నీ అత్యంత గొప్ప వరాలలో ఒకటని తెలుసుకునే జ్ఞానమును కూడా నాకు దయచేయుము.  ఈ సంస్కారంలో నేను నీ కారుణ్యాన్ని అత్యధికంగా అనుభవిస్తాను.  ప్రియమైన ప్రభువా, ఈ అమూల్యమైన వరానికి నీకు కృతజ్ఞతలు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పునీత యూదా తద్దేవునికి నవదిన ప్రార్థన
ఆశలేని పరిస్థితులలోను, దిక్కుతోచని సమస్యలలోను
సంవత్సరంలో ఎప్పుడైనా, ప్రత్యేకించి అక్టోబరు 19–27 తేదీలలో ప్రార్థించవచ్చు

అక్టోబరు పవిత్ర జపమాల మాసం

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు