తెలుగు

ధ్యానం 307: దివ్య మిత్రునితో సంభాషించడం

ప్రార్థనలో ఒక ఏకాంతవాసి, గెరిట్ డౌ చిత్రశాల వారి కృతి

వీడియో

ఆంగ్లంలో వినండి

మీరు ఎలా ప్రార్థిస్తారు? ప్రార్థించడానికి ఎన్నో మంచి మార్గాలు ఉన్నాయి. సాధారణంగా అనుసరించే కొన్ని మార్గాలు ఇవి: దివ్యబలిపూజలో లేదా మరొక ఆరాధనా వేడుకలో పాల్గొనడం, జపమాల లేదా ఇతర జపమాలికలను ప్రార్థించడం, ధ్యానపూర్వకంగా పవిత్ర గ్రంథాన్ని చదవడం, అందంగా రచించిన ప్రార్థనలను పఠించడం, మన ప్రభువు సమక్షంలో మౌనంగా కూర్చోవడం, ముఖ్యంగా దివ్యసత్ప్రసాదంలో ఉన్న ఆయన ముందు సాష్టాంగపడటం మొదలైనవి. వీటికి అదనంగా మరో ప్రార్థనా మార్గం ఏమిటంటే, మీ మనసులో ఉన్నదంతా చెబుతూ మన ప్రభువుతో సంభాషించడం. మీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు, మీ ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు, మీ గురించి మీకు తెలిసినదానికంటే ఆయనకు ఎంతో బాగా తెలుసు అన్నది నిజమే. అయినా, కొన్నిసార్లు ఆయనతో సంభాషించడం మీకు ఒక ఆశీర్వాదంగా అనిపిస్తుంది. మీ జీవితాన్ని, మీ ఆందోళనలన్నిటినీ, మీ ప్రశ్నలన్నిటినీ, అయోమయాలన్నిటినీ ఒక్కొక్కటిగా తలచుకుంటూ, వాటిని నేరుగా మన ప్రభువుకు చెప్పవచ్చు. మీరు మాట్లాడుతూనే ఆలకించడానికి కూడా ప్రయత్నించినంత కాలం, ఈ ప్రార్థనా విధానం జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. మీ ఆందోళనలన్నిటినీ ఆయనకు చెప్పడం ఒక అద్భుతమైన కార్యం. మీ జీవితంలోని ప్రతి భాగంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నప్పుడు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది (చూడండి దినచర్య #1485-1489).

మరి మీరు ఎలా ప్రార్థిస్తారు? ఈ రోజు మీరు అనుసరించే వివిధ ప్రార్థనా పద్ధతులను గురించి ఆలోచించండి. వాటికి అదనంగా మరికొన్ని పద్ధతులను చేర్చుకోవచ్చేమో పరిశీలించండి. ముఖ్యంగా, ఒక మిత్రునితో మాట్లాడినట్లే కూర్చొని మన ప్రభువుతో సంభాషించడం గురించి ఆలోచించండి. మీ హృదయంలో ఉన్నదంతా చెప్పడం, ప్రతి ఆందోళనను వ్యక్తపరచడం, మీకున్న ప్రతి ప్రశ్నను దేవుని ముందుంచడం వల్ల కలిగే మానసిక ప్రయోజనం గురించి కూడా ఆలోచించండి. ఆ సంభాషణకు విలువ ఉంది. ఆయన సమాధానాలు మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ మీకు ఏమి అవసరమో దేవునికి తెలుసు. సమస్తాన్నీ ఆయన వద్దకు తీసుకువెళ్లినప్పుడు, ఆయన ఆలకించి స్పందిస్తారనే నిశ్చయంతో మీరు ఉండవచ్చు.

ప్రభువా, ప్రార్థించడం నాకు నేర్పించు. నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నా ఆత్మపై ఉన్న ప్రతి భారాన్ని గురించి నా నోట వినాలని ఎంతగా కోరుకుంటున్నావో తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి. ప్రియ ప్రభువా, సమస్తాన్నీ నీ వద్దకు తీసుకువచ్చి, నీ పాదాల చెంత ఉంచి, నన్ను నేను నీ మృదువైన చేతుల్లో పూర్తిగా అప్పగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఆలకిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నవంబర్ 3 – పునీత మార్టిన్ డె పోరెస్, సన్యాసి

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు