మరీ ఎలెన్రీడర్ చిత్రించిన బాలల స్నేహితుడిగా యేసు
వీడియో ఆంగ్లంలో వినండి
దేవుని కారుణ్యాన్ని అందించే శక్తిమంతమైన మార్గాలలో ఇతరులతో స్నేహం ఒకటి. అయితే స్నేహాన్ని వివిధ స్థాయిలలో జీవించవచ్చు. కొన్నిసార్లు ఈ బంధం పైపై విషయాలపైనా, ప్రాముఖ్యం లేని విషయాలపైనా ఆధారపడి ఉంటుంది; మరికొన్నిసార్లు అది మన ప్రభువులో లోతుగా వేరూని ఉంటుంది. ఒకరి కోసం మరొకరు ప్రార్థించడం గాఢమైన ఆధ్యాత్మిక స్నేహానికి ఒక సూచన. విశ్వాసంతో నిండిన వ్యక్తితో స్నేహం మీకు వరంగా లభించి ఉంటే, ఒకరి కోసం మరొకరు ప్రార్థించాలనే నిబద్ధతతో ఆ స్నేహాన్ని సుస్థిరం చేసి, మరింత గాఢం చేసుకోండి. మీ జీవితాన్ని, మీ అవసరాలను ఒకరితో మరొకరు పంచుకోండి; ఆ అవసరాల కోసం ప్రార్థించడానికి నిబద్ధులవండి. ఒకరి కోసం మరొకరు ప్రార్థించడం ద్వారా, మీ ఇద్దరి జీవితాలలో దేవుని కారుణ్యం కుమ్మరించబడుతుందని, ప్రభువులో మీ పరస్పర బంధం మరింత గాఢమవుతుందని మీరు తెలుసుకుంటారు. ఇది దేవుని కారుణ్యం ప్రసాదించే ఒక దీవెన మాత్రమే కాక, ఆ కారుణ్యం నిరంతరం కుమ్మరించబడటానికి ఒక మూలం కూడా (చూడండి దినచర్య #1171).
మీ స్నేహబంధాల గురించి ధ్యానించండి. ప్రతి స్నేహబంధానికి పునాది ఏమిటి? బహుశా ఒక్కొక్కటి ఒక్కోలా ఉండవచ్చు. కొన్ని, ఉమ్మడి ఆసక్తిపై ఆధారపడిన సాధారణ పరిచయాలై ఉండవచ్చు. మరికొన్ని, ఒకరినొకరు కలిపి ఉంచే మరింత లోతైన బంధంపై ఆధారపడి ఉండవచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా, దేవునిపట్ల మీకున్న ఉమ్మడి ప్రేమపై ఆధారపడిన స్నేహబంధాల గురించి ధ్యానించడానికి సమయం కేటాయించండి. అలాంటి స్నేహబంధం మీకు వరంగా లభించి ఉంటే, కలిసి ప్రార్థించడం ద్వారా దానిని మరింత గాఢం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మిత్రులకు అత్యంత అవసరమైనది ఏమిటో ధ్యానించి, ఆ ఉద్దేశం కోసం ప్రార్థించడానికి నిబద్ధులవండి. మీ అవసరాన్ని కూడా వారితో పంచుకోండి. ఇలా ఒకరి కోసం మరొకరు ప్రార్థించడం దేవుని కారుణ్యానికి శక్తిమంతమైన మూలంగా ఉంటుంది.
ప్రభువా, ఈ రోజు నా స్నేహబంధాల కోసం ప్రత్యేకంగా నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మిత్రులను నీకు సమర్పిస్తూ, వారిపై నీ కృప సమృద్ధిగా కుమ్మరించబడాలని వేడుకుంటున్నాను. ప్రభువా, నా మిత్రులలో ఒకరి జీవితంలోని ఈ ప్రత్యేక అవసరాన్ని నీకు సమర్పిస్తున్నాను (ఒక అవసరాన్ని గుర్తుచేసుకోండి). ప్రియమైన ప్రభువా, మా ప్రతి ఒక్కరిపట్ల నీకున్న అచంచలమైన ప్రేమకూ, మా జీవితాలలో నీవే ప్రసాదించిన పరిపూర్ణమైన స్నేహవరానికీ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
ఆగస్టు 13 – పవిత్రులు పొంతియాను, పాపుగారు మరియు హిప్పోలిటస్, యాజకుడు, వేదసాక్షులు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




