తెలుగు

ధ్యానం 311: వినయం యొక్క సత్యం

చిత్రం సౌజన్యం: Pixabay

వీడియో

ఆంగ్లంలో వినండి

వినయం అనే మహిమాన్వితమైన సద్గుణాన్ని అర్థం చేసుకోవాలి, నిరంతరం మననం చేయాలి, నిరంతరం అలవరచుకోవాలి.  వినయం అంటే ఏమిటి?  మీ గురించి సత్యాన్ని తెలుసుకోవడం, ఆ సత్యాన్ని నమ్మడం, ఆ సత్యానికి అనుగుణంగా జీవించడం తప్ప మరేమీ కాదు.  మీ అంతఃకరణపు లోతులు మీకూ దేవునికీ మాత్రమే తెలుసు.  మనుషుల అభిప్రాయాలకు అంత ప్రాముఖ్యం లేదు.  మీలో గర్వమో మరేదైనా పాపమో ఉందని ఊహించుకుని కొందరు మీ గురించి తప్పుడు తీర్పులు ఇవ్వవచ్చు.  మరికొన్ని సందర్భాల్లో కొందరు అపవిత్రమైన ఉద్దేశాలతో మీ సద్గుణాన్ని అతిశయించి ముఖస్తుతి చేయవచ్చు.  తప్పుడు విమర్శలుగానీ ముఖస్తుతి మాటలుగానీ వినయాన్ని పెంపొందించవు; ఎందుకంటే ఆ రెండింటి ఉద్దేశమూ సత్యం కాక మరేదో అయి ఉంటుంది.  కొందరు పవిత్రాత్ములు కూడా ఇతరుల ప్రశంసలనో సానుభూతినో పొందడానికి తమ పవిత్రతను అతిశయించి చెప్పడం ద్వారానో, తమ దయనీయ స్థితిని వక్రీకరించి చూపడం ద్వారానో, తాము నిజంగా ఎలాంటివారో అనే సత్యాన్ని తప్పుగా చూపడానికి ప్రయత్నించవచ్చు.  అయితే, మళ్లీ చెప్పాలంటే, మనం నిజంగా ఎలాంటివారమో అనే సత్యమే వినయం యొక్క లక్ష్యం.  మీ జీవితానికి సంబంధించిన పూర్తి సత్యాన్ని తెలుసుకుని నమ్మడానికి ప్రయత్నించండి; ఆ తరువాత ఆ సత్యానికి అనుగుణంగా బాహాటంగా, నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించండి.  ఈ ఉద్దేశశుద్ధి మీ నిజస్వరూపం వెలుగులోకి రావడానికి దోహదపడుతుంది; ఈ వినయపూర్వకమైన క్రియ ద్వారా ప్రభువు మీ ఆత్మ నుండి ప్రకాశిస్తారు (చూడండి దినచర్య #1502-1503).

మీరు నిజంగా ఎలాంటివారో అనే సత్యాన్ని ఈ రోజు మననం చేయండి.  మీ పనులు, మీ ఉద్దేశాల విషయంలో సంపూర్ణ నిజాయితీ కోసం కృషి చేయండి.  మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి; దేవుడు మిమ్మల్ని ఎరిగినట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.  ఇలా చేయడం గొప్ప వినయాన్ని పెంపొందిస్తుంది.  మీరు వినయంలో ఎదుగుతున్న కొద్దీ, దేవుని గురించిన సత్యాన్ని, ఆయన మహోన్నతత్వాన్ని కూడా దర్శించండి.  దేవుడు మీ కోసం చేసేవన్నిటినీ వినయంతో గుర్తించి అంగీకరించండి.  దేవుడు మీలో కార్యం చేస్తున్నారని గుర్తించి, ఈ విషయాన్ని నిజాయితీగా కృతజ్ఞతతో వ్యక్తపరచడం ద్వారా, అందరికీ కనబడేలా ఆయన సుందరంగా ప్రకాశించడానికి మీరు వీలు కల్పిస్తారు.  ఇదే సత్యం, ఇదే వినయం. 

ప్రభువా, నేను నిజంగా ఎలాంటివ్యక్తినో అనే సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.  ఈ సత్యాన్ని అన్వేషిస్తున్నాను; అది నిజాయితీతో, నైతిక నిష్ఠతో ప్రకాశించేలా చేయాలని కోరుకుంటున్నాను.  నీ మహోన్నతత్వాన్ని దర్శించి, నా జీవితంలో నీవు చేసే కార్యాలను గుర్తించి అంగీకరించేలా కూడా ప్రార్థిస్తున్నాను.  ప్రియమైన ప్రభువా, నీవు మహిమాన్వితుడవు.  ఈ సత్యం ప్రకాశించుగాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మా యూట్యూబ్ ఛానెల్‌కు సభ్యత్వం పొందండి!
కొత్త విషయాలు ప్రచురితమైనప్పుడు సమాచారం పొందండి.

\

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు