తెలుగు

ధ్యానం 146: క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ప్రార్థించడం

చిత్రం సౌజన్యం: పిక్సాబే.

వీడియో

ఆంగ్లంలో వినండి

మన ప్రభువు పవిత్ర శ్రమల గురించి మనందరికీ తెలుసు.  అయితే నిజమైన అనుభూతితో, ప్రేమతో ఆయన శ్రమలను తిలకించగలిగేవారు కొద్దిమందే.  మన ప్రార్థనలో మన ప్రభువు శ్రమలను గొప్ప భక్తితో ధ్యానించడం నేర్చుకోవాలి.  ఇది ప్రధానంగా మన సొంత ప్రయత్నంతో చేసేది కాదు; బదులుగా, మన ప్రభువు మనలో చేయడానికి మనం అనుమతించేది.  ఆయన అనుభవించిన తీవ్రమైన వేదనను మనకు వెల్లడించడానికి ఆయనను అనుమతించాలి. అలా ఆయన వెల్లడించినప్పుడు, మనపై ప్రేమతో ఈ భయంకరమైన మరణాన్ని పొందిన ఆయనపట్ల ప్రేమతో మన సర్వస్వమూ నిండిపోవడానికి మనం సమ్మతించాలి (చూడండి డైరీ #737).

మన ప్రభువు శ్రమలను ధ్యానించడానికి మీరు సమయం కేటాయిస్తున్నారా?  బహుశా ఆయన పునరుత్థానాన్ని, పాపమరణాలపై ఆయన సాధించిన మహావిజయాన్ని చూడటం మరింత సులభంగా అనిపించవచ్చు.  కానీ పునరుత్థానానికి, మహిమప్రాప్తికి దారి శ్రమల గుండానే సాగుతుంది.  మన ప్రభువు అనుభవించిన ప్రతి బాధలోనూ, ప్రతి వేదనలోనూ పాలుపంచుకునేలా ఆయన మిమ్మల్ని నడిపించడానికి మీరు ఎంత సుముఖంగా ఉన్నారో ఈ రోజు ధ్యానించండి.  ఆయన శ్రమలను యథార్థంగా చూడటం వల్ల మీరు ఆయనను మరింత గాఢంగా ప్రేమించగలుగుతారు.  ఆయన బాధను మీరు ఎంతగా గ్రహిస్తారో, మీ ప్రేమ ద్వారా, ఆయన పవిత్ర చిత్తానికి విధేయత ద్వారా గాయపడిన ఆయన హృదయాన్ని ఓదార్చాలని అంతగా కోరుకుంటారు.  క్రీస్తు శ్రమలలోని ప్రతి అంశం మీతో మాట్లాడి, మిమ్మల్ని మార్చనివ్వండి.  ఫలితంగా దేవునిపట్ల మీ ప్రేమ మరింత గాఢమవుతుంది; మీ చుట్టూ బాధపడుతున్నవారిపట్ల మీ కారుణ్యం సమృద్ధిగా పొంగిపొర్లుతుంది.

ప్రభువా, నీ పవిత్ర శ్రమలను గ్రహించడానికి నాకు సహాయం చేయుము.  అంతటి వేదనను భరించడానికి నీకు శక్తినిచ్చిన ప్రేమను చూడటానికి నాకు సహాయం చేయుము.  నీ శ్రమలలో అందరిపట్ల నీకున్న అంతులేని ప్రేమను నేను చూడగలుగుదును గాక. ప్రతిగా, నీపై నాకున్న అదే ప్రేమతో బాధపడుతున్నవారిని నేను ప్రేమించగలుగుదును గాక.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మే 26 – పునీత ఫిలిప్ నేరి, గురువు—స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు