పోప్ లియో మరియు హూణుడైన అట్టిలా రూపొందించినవారు: నిక్ థాంప్సన్, లైసెన్స్ CC BY-NC-SA 2.0
వీడియో ఆంగ్లంలో వినండి
మీకు సర్వశక్తులూ ఉన్నట్లు, లేదా సర్వశక్తిమంతునికి ఆత్మీయ మిత్రులుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఐదవ శతాబ్దంలో జీవించిన పోప్ పునీత మొదటి లియో గురించి దేవుని శక్తిని వెల్లడించే ఒక కథ ఉంది. హూణుడైన అట్టిలా, అతని క్రూరమైన సైన్యం రోమును దోచుకోవడానికి ప్రయత్నించారని చెబుతారు. పోప్ పునీత లియో అట్టిలాను కలిసి, వెనుదిరిగేలా అతనిని “ఒప్పించారు”. తరువాత, ఎందుకు వెనుదిరిగావని అట్టిలా సైన్యం అడిగినప్పుడు, పోప్ పక్కన యాజకుని వేషధారణలో నిలిచిన ఒక రూపాన్ని చూసి తాను భయపడ్డానని అట్టిలా చెప్పాడు. ఆ రూపం ఒర నుండి తీసిన ఖడ్గాన్ని పట్టుకొని, అట్టిలా ముందుకు వస్తే అతనిని కొట్టి చంపుతానన్నట్లు ప్రవర్తించింది. భయంతో అట్టిలా వెనుదిరిగి వెళ్లిపోయాడు.
సమస్త దుష్టత్వం నుండి మనలను రక్షించే దేవుని శక్తిని ఈ చిన్న కథ వెల్లడిస్తుంది. మీ పక్కన ఒక దేవదూత భౌతిక రూపంలో కనిపించకపోయినా, మీరు దేవుని కారుణ్యంలో నిమగ్నమై ఉంటే దేనికీ భయపడనవసరం లేదని నిశ్చయంగా నమ్మవచ్చు. పరలోక శక్తులన్నీ మీ పక్షాన ఉంటాయి. ప్రభువు మిమ్మల్ని ప్రతి కీడు నుండి రక్షిస్తారు; తనకు మహిమ కలిగించే సమస్తాన్ని నెరవేర్చడానికి మీకు బలాన్ని ఇస్తారు (చూడండి డైరీ #858).
ఈ రోజు రెండు విషయాల గురించి ధ్యానించండి: 1) క్రీస్తుతో మీ ఐక్యత; 2) ఆ ఐక్యత నుండి ప్రవహించే శక్తి. ప్రభువు మిమ్మల్ని సమస్త కీడు నుండి కాపాడతారని మీరు నమ్ముతున్నారా? మీకు విశ్వాసం ఉండి, దేవుని కారుణ్యాన్ని వస్త్రంలా ధరించినప్పుడు భయపడటం వ్యర్థమని మీరు గ్రహిస్తున్నారా? ఈ సత్యాన్ని ధ్యానించి, మీ జీవితంలో మీ ఏకైక సేనాధిపతిగా ఉండవలసిన ప్రభువుకు మిమ్మల్ని మీరు మరింత సంపూర్ణంగా సమర్పించుకోండి.
నా ప్రభువా, నా ఏకైక సేనాధిపతీ, నా జీవితాన్ని నీకు నమ్మకంతో అప్పగిస్తున్నాను. నా సర్వస్వాన్ని, ముఖ్యంగా నన్ను భయానికి లోనుచేసే ప్రలోభాలన్నిటినీ నీకు అప్పగిస్తున్నాను. నీ దైవకారుణ్యంపై నాకు దృఢమైన నమ్మకాన్ని ప్రసాదించు; అన్ని విషయాలలో ఏ సంకోచమూ లేకుండా నీపై ఆధారపడటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




