ప్రార్థిస్తున్న వృద్ధురాలు, గెరిట్ డౌ చిత్రణ
ఆంగ్లంలో వినండి
సాధారణంగా, విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, లెక్కలేనన్ని అంతర్దృష్టులు, దైవిక వెల్లడింపులు ఆనందాన్ని కలిగిస్తాయి. విశ్వాస జీవితంలోని వివిధ అంశాలు సజీవంగా అనిపిస్తాయి; జీవితంలోని ఎన్నో రహస్యాలను గురించిన అవగాహన లభిస్తుంది. దేవుడు ఎంచుకున్న మార్గంలో నడవడం ప్రారంభించినప్పుడు, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, అవగాహన అనే ఈ వరం గొప్ప బహుమానంగా, మార్గదర్శిగా ఉంటుంది. కానీ కాలం గడుస్తూ, ఆత్మ విశ్వాస రహస్యాలలోకి లోతుగా ప్రవేశిస్తున్నకొద్దీ, ఒక రకమైన అస్పష్టత చోటుచేసుకోవచ్చు. దీనికి పాపం లేదా ఆధ్యాత్మిక అలసత్వం కారణమైతే, పాపసంకీర్తన ద్వారా, ప్రభువును వెదకడానికి కొత్తగా దృఢనిశ్చయం చేసుకోవడం ద్వారా దానిని సరిచేసుకోవాలి. అయితే, ఈ అనుభవం విశ్వాసం మరింత లోతుగా మారడం వల్ల కూడా కలగవచ్చు. దేవుడు చీకటి, అస్పష్టతల ద్వారా సంభాషించే సమయం వస్తుంది. తాను అర్థం చేసుకోలేనని ఆత్మ అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది. విశ్వాసంలోని మరింత లోతైన రహస్యాలను ఒక భావన లేదా అంతర్దృష్టి ద్వారా తెలియజేయలేము కాబట్టి ఇది ఒక వరం. మన ప్రభువు తెలియజేసే అత్యంత లోతైన విషయాలు మనస్సును చీకటి కమ్ముకోవడం ద్వారానే అందించబడాలి. జ్ఞానం చీకటిలో మునిగిపోతుంది; అయినా అది దేవుని స్వరమే అనే నిశ్చయత నిలిచి ఉంటుంది (చూడండి డైరీ #1205).
మీ ఆంతరంగిక ప్రార్థనా జీవితం గురించి ధ్యానించండి. మీకు స్పష్టంగా ఒక “ఆంతరంగిక జీవితం” లేకపోతే, దానిని ప్రారంభించవలసిన సమయం ఇదే. ధ్యానం, సంభాషణ ద్వారా మన ప్రభువును వెదకండి; ఆయన మీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. మీకు ఆంతరంగిక ప్రార్థనా జీవితం ఉండి, దేవుని సన్నిధిని క్రమంగా అనుభవిస్తుంటే, మరింత లోతుకు వెళ్లడానికి ప్రయత్నించండి. అలా మరింతగా వెదుకుతున్నప్పుడు, మీ ఆత్మలో ధ్యానం, సంభాషణ స్థానంలో మరింత నిశ్శబ్దం, అస్పష్టత చోటుచేసుకుంటున్నట్లు అనిపించినా భయపడకండి. దేవుడు మీతో ఒక కొత్త స్థాయిలో మాట్లాడుతున్నారనడానికి ఇది ఒక సూచన కావచ్చు. ఈ అనుభవం గురించి ఒక గురువుతో మాట్లాడండి. మన ప్రభువు మిమ్మల్ని ప్రార్థనలో ఒక కొత్త స్థాయిలోకి మరింత లోతుగా ఆకర్షిస్తున్నప్పుడు, అన్ని విధాలా ఆయనకు విశ్వాసపాత్రంగా ఉండండి.
ప్రభువా, విశ్వాస జీవితంలోని నిశ్శబ్దం, అస్పష్టతలలోకి నన్ను లోతుగా ఆకర్షించాలని కోరుకుంటున్నాను. ఈ అత్యంత లోతైన స్థాయిలో నీతో ఆత్మీయ సంభాషణలో ఉండటానికి, నా ఆత్మ అంతరాళంలో పరివర్తన చెందటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పునీత మోనికాకు నవదిన ప్రార్థన
(ముఖ్యంగా దారితప్పిన బిడ్డల కోసం చేసే ప్రార్థన)
ఆగస్టు 18–26
ఆగస్టు 22 – ధన్య కన్య మరియ రాజ్ఞిత్వ స్మరణ
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




