చిత్రం: needpix.com సౌజన్యంతో
ఆంగ్లంలో వినండి
గత నెలలో మీ ప్రార్థనా జీవితంలో ఏమేమి చోటుచేసుకున్నాయో పరిశీలిస్తే, మీకు ఏమి కనిపిస్తుంది? ఆత్మసమర్పణ, ఇతరుల కొరకు ప్రార్థన, స్తుతి, ఆరాధనలతో గడిపిన క్షణాలు ఎన్నో ఉండి ఉంటాయని ఆశించవచ్చు. అలాగే, మీ ప్రార్థనలో దేవునికి గాఢమైన కృతజ్ఞతలను అర్పించిన క్షణాలు కూడా ఎన్నో ఉండి ఉంటాయని ఆశించవచ్చు. కృతజ్ఞతతో, నిజమైన కృతజ్ఞతతో ఉండటంలోనూ, ఆ కృతజ్ఞతను ప్రార్థనలో వ్యక్తపరచటంలోనూ ఎంతో శక్తి ఉంది. మనం కృతజ్ఞతతో ఉండవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు మనకు ప్రసాదించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకంటే మన సమస్యలపైనే తరచూ ఎక్కువగా దృష్టి పెడుతుంటాము. జీవితంలోని అత్యంత చీకటి వేళలో కూడా, ఒక పవిత్ర ఆత్మ కృతజ్ఞతతో ఉండటానికి ఎన్నో కారణాలను కనుగొనగలదు. ఎంతో చిత్తశుద్ధితో దేవునికి కృతజ్ఞతా ప్రార్థనలు అర్పించడం మన అంతరంగాన్ని నిజమైన ఆధ్యాత్మిక ఆనందపు శిఖరాలకు చేర్చగలదు (చూడండి: డైరీ #675).
మీరు ఏ విషయాలకు కృతజ్ఞతతో ఉన్నారు? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, దేవుడు మిమ్మల్ని ఏయే విధాలుగా సమృద్ధిగా ఆశీర్వదించాడు? దేవుడు మీకు ప్రసాదించిన ఆశీర్వాదాలు వెంటనే మీకు గుర్తుకు రాకపోతే, మీరు మరింత సమయం వెచ్చించి “మీ ఆశీర్వాదాలను లెక్కించుకోవలసిన” అవసరం ఉండవచ్చనడానికి అది ఒక స్పష్టమైన సూచన. దేవుడు మనకు ప్రసాదించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలపై దృష్టి నిలిపి, వాటిని గుర్తించి, ఒక్కొక్కటిగా పేర్కొంటూ, వాటిలో ఆనందించడం మంచిది. వాటిని మనం ఎంత ఎక్కువగా గుర్తిస్తామో, అంత ఎక్కువగా కృతజ్ఞతలో ఎదుగుతాము; కృతజ్ఞతలో ఎంత ఎక్కువగా ఎదుగుతామో, అంత ఎక్కువగా ఆశీర్వాదాలు పొందుతాము.
ప్రభువా, నా జీవితంలోని లెక్కలేనన్ని ఆశీర్వాదాలకై ప్రగాఢమైన కృతజ్ఞతతో నీకు వందనాలు అర్పిస్తున్నాను. ఆ ఆశీర్వాదాలను ప్రతిరోజూ మరింతగా గుర్తించి, వాటికి కృతజ్ఞతతో ఉండేలా నాకు సహాయం చేయి. జీవితమే ఒక వరమనీ, రేయింబవళ్లు నీవు నా జీవితంలో కార్యం చేస్తున్నావనీ గ్రహించడానికి నాకు సహాయం చేయి. ముఖ్యంగా జీవితం కష్టంగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా భారం నన్ను కుంగదీస్తున్నప్పుడు, ఈ ఆశీర్వాదాలను గుర్తించడానికి నాకు సహాయం చేయి. నా హృదయం కృతజ్ఞతతో నిండునుగాక; నీ మంచితనంలో నేను ఎల్లప్పుడూ ఆనందించుదునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
పవిత్రాత్మకు నవదిన ప్రార్థన
పెంతెకోస్తుకు సిద్ధపడేందుకు చేసే ప్రార్థన
శుక్రవారం, మే 15 – శనివారం, మే 23
పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




