తెలుగు

ధ్యానం 137: సిలువలోని శక్తి

చిత్రం peakpx.com ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

మీరు ప్రార్థించేటప్పుడు, ఎప్పుడైనా కూర్చొని సిలువపై యేసు స్వరూపాన్ని తదేకంగా చూస్తారా? బయటి దృష్టితో చూస్తే, సిలువపై యేసు స్వరూపం అర్థంకాని ఒక వాస్తవం. అంత భయానకమైన సంఘటనను మనం ఎందుకు ఉన్నతంగా ఎత్తిచూపి గౌరవిస్తాం? దేవుని కుమారుని క్రూరమైన హత్య మొదట్లో మనలను ఆకర్షించే విషయం కాకపోవచ్చు. అయినప్పటికీ, విశ్వాసంతో తదేకంగా చూసేవారిని ఆకర్షించే శక్తి సిలువపై యేసు స్వరూపంలో ఉంది. ఎందుకంటే అది కేవలం భయానకమైన, క్రూరమైన హత్య మాత్రమే కాదు; అన్నిటికంటే ముఖ్యంగా, అది పాపం మీద, మరణం మీద సంపూర్ణ విజయం. మన ప్రభువు సిలువ మరణం ఇప్పటివరకు తెలిసినవాటిలో అత్యంత గొప్ప ప్రేమకార్యం. ఎందుకంటే ఆ కార్యంలో, తమను తాము సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకొని ఆయనవైపు తిరిగేవారి కోసం ఆయన మరణాన్ని, పాపాన్ని శాశ్వతంగా నాశనం చేశారు. మనం జీవించాలని పిలువబడిన ఆత్మసమర్పణ జీవితానికి కూడా సిలువపై యేసు స్వరూపం ఒక సూచన. ఇతరులకు మనలను మనం అర్పించుకుంటూ, ఆ సిలువనెక్కి క్రీస్తుతో కలిసి మరణించడానికి మనలో ప్రతి ఒక్కరం పిలువబడ్డాం. ఎందుకంటే ఆయనతో కలిసి మరణించడంలో మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది; ఆయన పునరుత్థాన విజయంలో మనం పాలుపంచుకోగలుగుతాం. మన ప్రభువు సిలువ మరణాన్ని తదేకంగా ధ్యానించడం మనలను రూపాంతరం చేస్తుంది. ఎందుకంటే ఈ నిస్వార్థ ప్రేమకార్యం ద్వారా సంపాదించిన కారుణ్యపు ద్వారాలను అది తెరుస్తుంది (చూడండి డైరీ #681).

సిలువపై యేసు స్వరూపం ముందు ప్రార్థించడానికి ప్రయత్నించండి. నిశ్శబ్దంగా కూర్చొని ఆ స్వరూపాన్ని తదేకంగా చూడటానికి ప్రయత్నించండి. “తదేకంగా చూడటం” అంటే కేవలం “చూడటం” కంటే ఎక్కువ. మనం తదేకంగా చూస్తున్నప్పుడు, మన కంటికి కనిపించే రూపాన్ని దాటి, యేసును ఆ క్షణం వరకు నడిపించిన ప్రేమలోకి తొంగిచూడాలని కోరుకుంటాం. మన పాపాల నుండి మనలను రక్షించడానికి, పరిపూర్ణమైన ప్రేమతో మనలను ప్రేమించడానికి ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడిన అనంత ప్రేమమయుడైన దేవుణ్ణి మనం చూస్తాం.

ప్రభువా, నీ పరిపూర్ణ ప్రేమకార్యాన్ని తదేకంగా చూడాలని, నాపైనా లోకమంతటిపైనా కారుణ్యాన్ని ఉప్పొంగించే నీ హృదయాన్ని దర్శించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. నీ బలియాగమనే అగాధమైన వరాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ వరానికి నిత్య కృతజ్ఞతతో జీవించడానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పవిత్రాత్మకు నవదిన ప్రార్థన
పెంతెకోస్తుకు సిద్ధపడేందుకు చేసే ప్రార్థన
శుక్రవారం, మే 15 – శనివారం, మే 23

ప్రభువు స్వర్గారోహణం గురించి చదవండి

పాస్కా కాల ప్రార్థనలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

పాస్కా కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు