చిన్న డేవిడ్ – దేహసంబంధమైన ఏడు కారుణ్య కార్యాలు
ఆంగ్లంలో వినండి
అంతులేని దేవుని కారుణ్యానికి సాధనంగా మారాలని మీరు కోరుకుంటున్నారా? అలా అయితే, మీ చేతలు, మాటలు, ప్రార్థనల ద్వారా మీరు అలా మారగలరు. మొదటిగా, మీ చేతల ద్వారా కారుణ్యం చూపించే అవకాశాల కోసం మీరు నిరంతరం “వెతుకుతూ” ఉండాలి. చాలాసార్లు, అవకాశం లభించినప్పుడు (ఉదాహరణకు, మరొకరిని క్షమించడానికి), మనం ముఖం తిప్పుకుంటాం. కానీ ఈ అవకాశాలను వెతకడంలో మనం అప్రమత్తంగా, నిబద్ధతతో ఉండాలి; అవి లభించినప్పుడు సంతోషించాలి. రెండవదిగా, మీ మాటలు కృపను, కారుణ్యాన్ని అందించగలవు; లేదా గాయపరచి హాని చేయగలవు. కఠినంగా ప్రవర్తించడం ద్వారా, లేదా మాట్లాడవలసినప్పుడు మాట్లాడకపోవడం ద్వారా కూడా మనం హాని చేస్తాం. దేవుని సత్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, సవాలు చేసే మాటలైనా సరే, ప్రేమతో సత్యవచనాలు పలికినప్పుడు మనం కారుణ్యాన్ని అందిస్తాం. మూడవదిగా, ఇతరుల కోసం ప్రార్థించడంలోను, త్యాగాలు అర్పించడంలోను ఉన్న శక్తిని మనం తరచుగా మరచిపోతాం. మొత్తం లోకం కోసం, ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తి కోసం మధ్యవర్తిత్వ ప్రార్థన చేయడం, తాళంచెవిని తిప్పి దేవుని కృపకు ద్వారాలు తెరవడం వంటిది. అత్యవసరమైన ఈ కారుణ్య కార్యాన్ని నిర్లక్ష్యం చేయకండి (చూడండి డైరీ #742).
మీ చేతలు, మాటలు, ప్రార్థనల గురించి ధ్యానించండి. తన కారుణ్యాన్ని ఇతరులకు అందించడానికి మన ప్రభువు మిమ్మల్ని ఉపయోగించుకున్న నిర్దిష్టమైన విధానాలను మీరు చెప్పగలరా? వాటిలో కొన్నింటిని గుర్తించడానికి ప్రయత్నించండి. ఈ ఆత్మపరిశీలనలో మీకు కష్టంగా అనిపిస్తే, మీ ద్వారా ప్రతిరోజూ కురిపించే తన కారుణ్యాన్ని ప్రభువు మరింతగా పెంచాలని కోరుకుంటున్నారనడానికి అది ఒక మంచి సూచన.
ప్రభువా, నా మాటలను, నా చేతలను, నా ప్రార్థనా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ చిత్తప్రకారం నన్ను ఉపయోగించుకో; ప్రతిరోజూ నీవిచ్చే ప్రేరణను శ్రద్ధగా గమనించేందుకు నాకు సహాయం చేయి. ఈ లోకంలో నీ పరిపూర్ణ ప్రేమను వ్యాపింపజేయడానికి ప్రతి రోజూ, రోజంతా అవకాశాలను మనస్ఫూర్తిగా వెతికేందుకు నాకు సహాయం చేయి. ప్రియ ప్రభువా, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
మే 27 – కాంటర్‌బరీకి చెందిన పునీత అగస్టిన్, బిషప్—ఐచ్ఛిక స్మరణ
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




