తెలుగు

ధ్యానం 208: కారుణ్యపు ఆధ్యాత్మిక బాణం

అనుగ్రహపు ఊట, కర్త: లారెన్స్ ఓపీ, CC BY-NC-ND 2.0.

వీడియో

ఆంగ్లంలో వినండి

సాధారణంగా, బాణం గాయపరుస్తుంది, ప్రాణం తీస్తుంది.  చరిత్ర అంతటా బాణాలను యుద్ధానికి, వేటకు ఉపయోగించారు.  కానీ కారుణ్యపు ఆధ్యాత్మిక బాణం ఎంతో భిన్నమైనది.  సిమియోను ప్రవక్త మన ధన్యమాతతో పలికిన ఈ మాటలను గుర్తు చేసుకోండి: “ఒక ఖడ్గం నిన్ను కూడా ఛేదిస్తుంది” (లూకా 2:35).  అలాగే సిలువ మరణ సమయంలో జరిగినదాన్ని గుర్తు చేసుకోండి: “ఒక సైనికుడు తన ఈటెను [యేసు] ప్రక్కలో పొడిచాడు; వెంటనే రక్తం, నీరు బయటకు ప్రవహించాయి” (యోహాను 19:34).  ఒక ఖడ్గం, ఒక ఈటె మన ధన్యమాత హృదయాన్ని, యేసు హృదయాన్ని ఛేదించాయి.  అలాగే మన హృదయాలు కూడా ఛేదింపబడాలి.  అయితే మనం స్వీకరించవలసిన ఖడ్గాన్ని, ఈటెను లేదా బాణాన్ని ప్రేమతో అంగీకరిస్తే, అది మనకు హాని కలిగించే విధంగా గాయపరచదు.  బదులుగా, అది మన హృదయాల నుండి కారుణ్యాన్ని, సానుభూతిని వెలికి తెస్తుంది.  ఈ “ప్రేమ గాయం”లో దుఃఖం, బాధ రూపాంతరం చెందుతాయి; ఆ గాయం ద్వారా మన జీవితాల నుండి దేవుని కారుణ్యం ప్రవహిస్తుంది (చూడండి డైరీ #1082).

ఈ రోజు రెండు విషయాలపై ధ్యానించండి.  మొదట, యేసు మరియల హృదయాల్లోని ఆధ్యాత్మిక గాయాలను గురించి ఆలోచించండి.  ఛేదింపబడిన వారి హృదయాల మర్మంలోకి ప్రవేశించండి.  ఈ గాయాలు అవసరంలో ఉన్నవారిపట్ల సానుభూతిని, కారుణ్యాన్ని పుట్టిస్తాయి కాబట్టి, వాటి నుండి అనుగ్రహం ప్రవహిస్తుందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.  రెండవదిగా, మీ సొంత హృదయాన్ని గురించి ఆలోచించండి.  మీలో ఉన్న ఏ గాయాన్నైనా గురించి ధ్యానించి, ఆ గాయం రూపాంతరం చెందగలదని గ్రహించండి.  యేసు హృదయం నుండి, మన ధన్యమాత హృదయం నుండి ప్రవహించే కారుణ్యంలో ఆ గాయం పాలుపంచుకోగలదు.  పాపం పట్ల వారికున్న పవిత్రమైన దుఃఖంలో పాలుపంచుకోండి; పాపి పట్ల సానుభూతిని పెంపొందించుకోండి.  ఇలా చేయడం ద్వారా, ప్రేమ అనే ఆధ్యాత్మిక బాణం మీ హృదయాన్ని గాయపరుస్తుంది.

ప్రభువా, నీ అతిపవిత్ర హృదయం భరించిన వేదనలోని గొప్ప మర్మాన్ని గ్రహించడానికి నాకు సహాయం చేయి.  కారుణ్యాన్ని ప్రవహింపజేయడానికి నీవు ఆ గాయాన్ని స్వేచ్ఛగా అంగీకరించావని నేను గ్రహించేలా చేయి.  ఇతరుల బాణాలకు ప్రతిగా నీ కారుణ్యం ప్రవహించేలా, నేను కూడా ఆ బాణాలను అంగీకరించడానికి నాకు సహాయం చేయి.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు