హెన్రిక్ సీమిరాడ్జ్కీ చిత్రించిన మార్తా, మరియల ఇంటిలో క్రీస్తు
ఆంగ్లంలో వినండి
గొప్ప అధికారం గల వ్యక్తిని కలవడం ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ఉదాహరణకు, మీరు పనిచేయాలనుకునే సంస్థ అధ్యక్షుణ్ణి కలవడం, లేదా ప్రసిద్ధ వ్యక్తిని మొదటిసారి కలవడం, లేదా పీఠాధిపతిని గానీ పరిశుద్ధ పాపుగారిని గానీ కలవడం—ఇవన్నీ ఒక విధమైన ఉత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ అది కొంత భయాన్ని, ఆందోళనను కూడా కలిగించవచ్చు. నిజానికి, మీరు ఎప్పుడైనా కలుసుకునే వ్యక్తులందరిలో అత్యంత ముఖ్యమైన, “ప్రభావశీలమైన” వ్యక్తి మీ దేవుడే. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు; అంటే, సమస్త శక్తి గలవాడు, సమస్తమూ తెలిసినవాడు. ఆయన పరిపూర్ణ ప్రేమమయుడు కూడా. ఆ పరిపూర్ణ ప్రేమతోనే ఆయన తన కృపా మహిమల సింహాసనం నుండి దిగివచ్చి, మీతో సంభాషిస్తారు, మీ బాగోగులు చూసుకుంటారు, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. ఆయన మిమ్మల్ని సమృద్ధియైన ఆనందంతో నింపడానికి వస్తారు. మన ప్రభువుతో జరిగే ప్రతి “కలయిక” ఎంతో ఉత్సాహభరితంగా ఉండాలి. అంటే, దానిని గంభీరంగా తీసుకుని, మీరు ఎప్పుడైనా తెలుసుకోగల అత్యంత ముఖ్యమైన ఈ వ్యక్తికి ప్రతిగా మీ శ్రద్ధను, ప్రేమను అర్పించాలి (చూడండి: డైరీ #885).
మీరు ప్రార్థనలో ఆయన వద్దకు వెళ్లినప్పుడు మీ అంతరంగ అనుభవం ఎలా ఉంటుంది? అది మీరు మరీ తేలికగా, సంసిద్ధత లేకుండా పాల్గొనే కలయికగా ఉంటుందా? అది మీలో భయాన్ని, ఆందోళనను కలిగిస్తూ, ఆయనను తప్పించుకునే మార్గాలను వెదికేలా చేసే కలయికగా ఉంటుందా? లేక విశ్వానికి దేవుడైన ఆయన మీపట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారంటే, తన కృపాసనం నుండి దిగివచ్చి, మీ బలహీనతలోను పాపంలోను మీతో సంభాషిస్తున్నారనే సత్యం మీకు ఊరటను, ఓదార్పును కలిగించడానికి మీరు అనుమతిస్తున్నారా? ప్రభువు పరిపూర్ణ వినయం మీకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించి, మీ పూర్ణహృదయంతో ఆయన వైపు తిరగడానికి ధైర్యాన్ని ఇవ్వాలి.
ప్రభువా, నాపట్ల నీకున్న ప్రేమకు నేను ఆశ్చర్యపోతున్నాను. విశ్వానికి దేవుడవైన నీవు నా బలహీనతలోను పాపంలోను నా వద్దకు వస్తున్నావు. నీవు నాపై శ్రద్ధ చూపుతూ, ప్రేమగల తండ్రిగా పరిపూర్ణమైన సంరక్షణను అందిస్తున్నావు. నీవు నీ కృపాసనం నుండి దిగివచ్చి నా ఆత్మలో ప్రవేశించేటప్పుడు కనబరచే వినయాన్ని చూసి నేను ఎల్లప్పుడూ భక్తిపూర్వక విస్మయంతో ఉండేలా నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
సామాన్య కాలానికి పవిత్ర గ్రంథ ధ్యానాలు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




