తెలుగు

ధ్యానం 187: తుఫాను తరువాత ఇంద్రధనుస్సు

చిత్ర మూలం: pxhere,CC0

వీడియో

ఆంగ్లంలో వినండి

సృష్టి స్వయంగా దేవుని మహిమను ప్రకటిస్తూ, విశ్వాస విషయాలను మనకు బోధించడం ఎంతో అద్భుతమైన విషయం. ఇంద్రధనుస్సునే తీసుకోండి. అది ప్రకాశవంతంగా, అందంగా, రంగురంగులుగా ఉండి విస్మయాన్ని కలిగిస్తుంది. ఇంద్రధనుస్సును చూసి అందరూ సంతోషిస్తారు. కానీ వర్షమో తుఫానులో లేకుండా ఇంద్రధనుస్సు అనేదే ఉండదు. జీవితం కూడా అంతే. మనకు మంచి రోజుల తరువాత చెడు రోజులూ, చెడు రోజుల తరువాత మంచి రోజులూ వస్తాయి. ఏవి వచ్చినా మనం ఆశ్చర్యపడకూడదు. ఆనందంతో నిండిన మంచి రోజున మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ “ఇంద్రధనుస్సు” ఒక వరమని గుర్తించాలి. చెడు రోజుల్లో దానిని గుర్తుచేసుకునేలా ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి. చెడు రోజు వచ్చినప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. సహనంతో ఆయన కోసం వేచి ఉంటే ఇది కూడా గడిచిపోతుందనే అవగాహనను ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ దేవుని కారుణ్యం శాశ్వతమైనది. అది అన్నిటినీ దాటడానికి మనకు తోడ్పడి, తుఫాను గడిచిపోయిన తరువాత మనం ఆనందించేలా చేస్తుంది (చూడండి దినచర్య #992).

ఇంద్రధనుస్సుకూ తుఫానుకూ మధ్య ఉన్న తేడా గురించి ఈ రోజు ధ్యానించండి. ఆకాశంలో ఒక చివర నుంచి మరో చివర వరకు ప్రకాశవంతమైన రంగులతో విస్తరించి ఉన్న ఇంద్రధనుస్సును ఊహించుకోండి. అది అందంగా, స్ఫూర్తిదాయకంగా ఉండి, చిరునవ్వునూ ఆనందాన్నీ కలిగిస్తుంది. ఇప్పుడు దానికి ముందు వచ్చిన తుఫానుతో దానిని పోల్చండి. తుఫాను మధ్యలో ఉన్నప్పుడు, తరువాత రాబోయే ఇంద్రధనుస్సు గురించి ఆలోచన వచ్చి ఉండదు. దానికి బదులుగా, ఆశ్రయం పొందడంపైనే ప్రధానంగా దృష్టి ఉంటుంది. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని ఎలా పోలి ఉండవచ్చో ధ్యానించండి. బాధ కలిగినప్పుడు లేదా సవాళ్లు మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీరు పరుగెత్తి దాక్కుంటారా? ప్రతి పోరాటం తరువాత ఒక ఇంద్రధనుస్సు రానున్నదని కూడా మీకు మీరు గుర్తుచేసుకోవాలి. దేవుని కారుణ్యం ప్రసాదించే దీవెనలను మీ మనస్సులో సజీవంగా ఉంచుకోండి. అప్పుడు అవి ప్రతిరోజూ జీవిత సవాళ్లను దాటడానికి మీకు తోడ్పడతాయి.

ప్రభువా, నా చూపును ఎల్లప్పుడూ నీపైనే నిలిపి ఉంచు. జీవితంలోని ప్రతి తుఫాను మధ్యలోనూ నేను నిరీక్షణను, ఆనందాన్ని నిలుపుకోగలుగుదును గాక. అణచివేతకు గురైనట్లు అనిపిస్తూ, కష్టాలు నన్ను ముంచెత్తినప్పుడు, ఇది కూడా గడిచిపోతుందనీ, నా పోరాటాలనూ నా జీవితాన్నీ నీవు పరిపూర్ణమైన, ఆనందభరితమైన ముగింపుకు తీసుకువస్తావనీ దయచేసి నాకు గుర్తుచేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 6 – పవిత్ర మరియా గొరెట్టి, కన్య మరియు వేదసాక్షి—ఐచ్ఛిక స్మరణ

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు