క్రైస్తవ వేదసాక్షుల చివరి ప్రార్థన, జాన్-లేయోన్ జెరోమ్ చిత్రించినది
వీడియో ఆంగ్లంలో వినండి
అంతా సవ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి “ప్రేమించడం” సులభం. కానీ అంతా సవ్యంగా ఉన్నప్పుడు, మన ప్రేమ పరీక్షకు గురికాదు. మానవ బాధల ద్వారా వచ్చే పరీక్ష దేవునిపట్ల మన ప్రేమను స్పష్టం చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఫలప్రదంగా ఉండగలదు. జీవితంలోని కష్టాలు కేవలం దుఃఖకరమైన, దురదృష్టకరమైన భారాలేననీ, వాటిని ఎలాగైనా తప్పించుకోవాలనీ నమ్మడం సులభం. ఉద్దేశపూర్వకంగా కష్టాలను సృష్టించుకోవడం అవివేకమే అయినా, ఈ జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల, జీవితంలోని ప్రతి కష్టాన్నీ బాధనూ దేవునిపై మీ నమ్మకాన్ని పెంచుకోవడానికీ, తద్వారా ఆయనపట్ల మీ ప్రేమను పెంచుకోవడానికీ ఒక అవకాశంగా స్వీకరించాలి. ఈ జీవితంలో ఎంతో బాధపడుతున్నప్పటికీ, ఆ బాధ అంతటిలోనూ దేవుణ్ణి ప్రేమించాలని ఎంచుకుని, ఆ బాధనే తన పవిత్రత పెరగడానికి మూలంగా చేసుకునే ఆత్మ ఎంత ధన్యమైనది! (చూడండి డైరీ #1014).
మీరు ప్రతిరోజూ దేని గురించి ఫిర్యాదు చేస్తుంటారు? మిమ్మల్ని భారపెట్టేది ఏమిటి? తరచుగా మనం ఈ భారాలనుంచి పారిపోతాం లేదా కోపపడతాం. మీ పోరాటాలను ఒక కొత్త దృక్కోణంతో చూడటానికి ప్రయత్నించండి. మీ నమ్మకాన్ని, మీ ప్రేమను మరింతగా పెంచుకునే అవకాశాలుగా వాటిని చూడటానికి ప్రయత్నించండి. జీవితంలోని ప్రతి బాధ, ప్రతి భారం శిలువ యొక్క ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయే అవకాశం కలిగి ఉన్నాయి. వాటిని ప్రేమతో స్వీకరించడం ద్వారా మనం శిలువను ఆలింగనం చేసుకుంటాం. శిలువను ఆలింగనం చేసుకోవడం ద్వారా మనం దేవుణ్ణి మరింతగా ప్రేమిస్తాం. కష్టాలు మీ జీవన నాణ్యతను తగ్గిస్తాయని అనుకోకండి. కృపవల్ల అవి ఏమవుతాయో గుర్తించండి. అవి పవిత్రతలో ఎదగడానికీ, దేవుని కారుణ్యాన్ని మరింతగా స్వీకరించడానికీ అవకాశాలు.
ప్రభూ, నేను అనుభవించే కష్టాల కారణంగా జీవితంలో కుంగిపోయినప్పుడు, కోపపడినప్పుడు లేదా నిరాశకు లోనైనప్పుడు, ఆ పోరాటాన్ని నీపై మరింత నమ్మకం పెంచుకునే అవకాశంగా ఉపయోగించుకోవడానికి నాకు సహాయం చేయి. ప్రభూ, అన్ని విషయాల్లోనూ నిన్ను మరింతగా పోలి ఉండేలా, శిలువ చెంతకు పరుగెత్తి వచ్చి, నీ శిలువనుంచి పొంగిపొరలిన ప్రేమను స్వీకరించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన ప్రభూ, ముఖ్యంగా జీవితంలో నేను నీకు సమర్పించే ప్రతి బాధ ద్వారా నా ప్రేమను పెంచు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
జూలై 11 – మఠాధిపతి పునీత బెనెడిక్టు జ్ఞాపకార్థ దినం
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




