తెలుగు

ధ్యానం 207: క్రీస్తు హృదయంలో సాంత్వన పొందడం

శిశువు, దేవదూతలతో మాత మరియ, జోవన్నీ బత్తిస్తా సాల్వి దా సస్సోఫెర్రాతో చిత్రకృతి, CC BY-SA 4.0, వికీమీడియా కామన్స్ ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

ప్రేమతో, మృదుత్వంతో చూసుకునే తల్లి లేదా తండ్రిని హత్తుకుని పిల్లలు తరచుగా ఎంతో సాంత్వన పొందుతారు.  ఆ ప్రేమపూర్వక బాహువులు గట్టిగా హత్తుకున్నప్పుడు ఎంతో తృప్తి కలుగుతుంది.  ఆ క్షణాల్లో భయం, ఆందోళన తొలగిపోతాయి; అంతకుముందు కలత ఉన్నా, శాంతి, ఓదార్పు తిరిగి లభిస్తాయి.  మన ప్రభువుతో కూడా అలాగే ఉండాలి.  సమస్త సాంత్వనకు మూలమైన ఆయన వద్దకు అలసిన మనలను మనం తీసుకువెళ్లడం ద్వారా లభించే ఆధ్యాత్మిక సాంత్వనను వెదకాలి.  మన ప్రభువు హృదయానికి చేరువ కావడం ఎలాంటి కల్లోలం మధ్యనైనా శాంతిని ప్రసాదిస్తుంది.  ఒత్తిడి, నిరాశ, మనోవేదన, అయోమయం తొలగిపోయి, వాటి స్థానంలో ధైర్యం, భద్రతాభావం కలుగుతాయి.  తన స్పందన లయలో ఆశ్రయం పొందమని మనలను ఆహ్వానించేలా ప్రభువు హృదయం స్పందిస్తుంది.  ఆయన అమూల్య రక్తం అనుగ్రహపు దుప్పటిలా మనలను కప్పుతుండగా, ప్రతి హృదయస్పందనతో ఆయన కనికరం, కారుణ్యం మనకు ప్రసాదించబడతాయి.  ఈ సాంత్వన మూలం వద్దకు పరుగెత్తండి; మీ దేవుని కరుణామయ హృదయమే మీ విశ్రాంతి స్థలంగా ఉండనివ్వండి (చూడండి డైరీ #1074).

మీ ప్రార్థనలో మన ప్రభువు కరుణామయ హృదయంలో సాంత్వనను, ఓదార్పును పొందగలుగుతున్నారా?  మీరు పంచుకోవడానికి ఆహ్వానించబడిన సాన్నిహిత్యాన్ని గురించి ధ్యానించండి.  అది మానవులు అందించగల ఏ సాంత్వననైనా మించిన సాన్నిహిత్యం; మీ ఆత్మను కారుణ్యంతోను, శాంతితోను నింపే అనుగ్రహాన్ని అది ప్రసాదిస్తుంది.  ప్రేమగల తల్లి లేదా తండ్రి ఒడిలో సాంత్వన పొందుతున్న చిన్నబిడ్డ రూపాన్ని మనసులో తలచుకోండి.  మన ప్రభువు మీ పట్ల చూపాలని కోరుకునే ఆదరణకు ఇది ఒక చిన్న సూచన మాత్రమే.

పరలోక తండ్రీ, నన్ను నీకు, నీ కుమారుని హృదయానికి చేరువగా ఆకర్షించు.  అన్ని విషయాలలోను, నా జీవితంలోని ప్రతి కలత క్షణంలోను నేను నీవైపు తిరిగేలా చేయి.  నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను; కనికరంతోను, ప్రేమతోను నిండిన నీ హృదయాన్ని అంటిపెట్టుకుంటున్నాను.   నీ హృదయం అలసిన నా ఆత్మకు విశ్రాంతి స్థలంగా ఉండుగాక.  నా దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నీలో, కేవలం నీలోనే ఆశ్రయం పొందుతున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

జూలై 26 –పవిత్ర యోవాకీము, అన్నమ్మ
ఈ సంవత్సరం ఆదివారం నాడు వస్తున్నందున దీనిని ఆరాధనాక్రమ స్మరణోత్సవంగా జరుపుకోరు

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు