తెలుగు

ధ్యానం 273: భూలోక బంధాలు కాదు, దేవునిపట్ల ప్రేమ మాత్రమే

పునరుత్థానం తరువాత మరియ మగ్దలేనకు క్రీస్తు దర్శనం, రష్యన్ మ్యూజియం ద్వారా

వీడియో

ఆంగ్లంలో వినండి

దేవునితో మన సంబంధం పరాకాష్ఠకు చేరుకోవడంలో, ఇతర భూలోక బంధాలన్నిటినీ విడిచిపెట్టడం కూడా ఉంటుంది. అప్పుడు గొప్ప తపనతో, స్పష్టమైన లక్ష్యంతో దేవునివైపు పరుగెత్తకుండా మనల్ని ఏదీ ఆపదు. ఈ జీవితంలోని ప్రతి మమకారం నుండి మనం విముక్తి పొందాలి; అప్పుడు మన ఏకైక అనుబంధం దేవునితోనూ, ఆయన పవిత్ర చిత్తంతోనూ ఉంటుంది. దీనర్థం ఇతరులపట్ల మన ప్రేమను నిర్లక్ష్యం చేయాలని కాదు. ముఖ్యంగా కుటుంబ ప్రేమ విషయంలో ఇది వర్తిస్తుంది. మీ కుటుంబ సభ్యులపట్ల ప్రేమకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండాలి; అది సంపూర్ణమైనదిగా, వెనక్కి తీసుకోలేనిదిగా మారాలి. అయితే, మీ కుటుంబాన్ని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించడానికి, వారిపట్ల భూలోక మమకారం కలిగి ఉండడానికి తేడా ఉంది. నిజానికి, మీరు క్రీస్తు హృదయంతో ప్రేమించాలంటే పవిత్రమైన అనాసక్తి అవసరం. యేసును ప్రేమించడమే జీవితంలో మీ ఏకైక కోరిక అయినప్పుడు, అది ఇతరుల ద్వారా మిమ్మల్ని ఆయనవైపు నడిపిస్తుంది. మీ కుటుంబంలోనూ, మీ భూలోక పిలుపులోని అన్ని అంశాలలోనూ మీరు క్రీస్తును ప్రేమిస్తారు. అయితే, మీరు ఆయనను ఈ పరిపూర్ణ ప్రేమతో ప్రేమించినప్పుడు, అందరిపట్ల మీకున్న ప్రేమ క్రీస్తుపట్ల ప్రేమగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు, మిగిలిన ప్రతి మమకారం దేవునిపట్ల మీ ప్రేమగా రూపాంతరం చెందుతుంది (చూడండి డైరీ #1365).

ఈ లోకంలో మీరు దేనిని ప్రేమిస్తున్నారు? మీరు దేనిపై మమకారం పెంచుకున్నారు? మీకు అత్యంత ప్రియమైన భూలోక విషయాల గురించి ఆలోచించండి. వీటిలో మీ కుటుంబ సభ్యులు, దేవుడు మీ జీవితంలోకి తీసుకువచ్చిన ఇతరులు కూడా ఉన్నారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రేమలను పరిశీలించి, వాటికి క్రీస్తు కేంద్రంగా ఉన్నారా అని ధ్యానించండి. వారిని ప్రేమించడం ద్వారా మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? లేక ఈ భూలోక ప్రేమలే అంతిమ లక్ష్యాలుగా మిగిలిపోతున్నాయా? దేవునిపట్ల ప్రేమనే మీ జీవితపు ఏకైక కేంద్రంగా చేసుకోవాలనే లక్ష్యాన్ని గురించి ధ్యానించండి. ప్రతి ఇతర వ్యక్తిలోనూ, వారి ద్వారానూ, మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

నా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అన్నిటికంటే మిన్నగా, అన్నిటిలోనూ నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. నా ప్రేమకు నీవే ఏకైక లక్ష్యమవుదువుగాక. నీ సృష్టిప్రాణులందరిలో నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, నేను నీకు మరింత చేరువవుదునుగాక; వారి జీవితాలపై నీ పరిపూర్ణ కారుణ్యాన్ని సమృద్ధిగా కురిపించుదునుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

సెప్టెంబర్ 30 – పూజారియు సభ పండితుడైన పునీత జెరోమ్ సంస్మరణ

చిన్న పుష్పమైన లిసియూకు చెందిన పునీత తెరేసాకు నవదిన ప్రార్థన
తొమ్మిదవ రోజు- సెప్టెంబర్ 30

దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు

దైనందిన సువార్త ధ్యానాలు

నేటి పునీతులు/పండుగలు