హియెరోనిమస్ బోష్, ప్రార్థనలో ఉన్న పునీత జెరోమ్, అందించినవారు: ఫ్రాన్స్ వాండెవాలె, CC BY-NC 2.0
ఆంగ్లంలో వినండి
మీరు ప్రార్థించేటప్పుడు మన ప్రభువు చెంతకు ఎలా వెళ్తారు? ప్రేమపూర్వక భక్తితో మీ రోజంతటినీ ఆయనకు సమర్పించడం, రోజంతా మీ అత్యంత సన్నిహిత మిత్రునితో మాట్లాడినట్లుగా ఆయనతో మాట్లాడడం నిశ్చయంగా మంచిదే. అయితే మన ప్రార్థన గాఢంగా ఉండవలసిన, ఆ గాఢతను వ్యక్తపరచవలసిన ఇతర సమయాలూ ఉంటాయి. ఇలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే, నిజంగానే మన ప్రభువు ముందు సాష్టాంగపడడం. మీ గదిలోని నిశ్శబ్దంలో గానీ, ఎవరూ లేని దేవాలయంలో గానీ, ఈ విధంగా ప్రార్థించడానికి అవకాశం వెతకండి. ఆ “గాఢత” మన ప్రభువుకు సంపూర్ణంగా లోబడటాన్ని వ్యక్తపరచేదిగా ఉండాలి. అది ఎక్కువసేపు కొనసాగాలి; స్వీయకేంద్రిత భావాలన్నిటినీ విడిచిపెట్టేదిగా ఉండాలి. ఈ విధంగా ప్రార్థించడం ఒక సుందరమైన ప్రేమకార్యం; దేవునికి తగిన విధంగా ఆయనను ఆరాధించే ఒక మార్గం. మనం ఆయనను ఎన్నడూ పరిపూర్ణంగా ఆరాధించలేకపోయినా, సాధ్యమైనంత సంపూర్ణంగా అలా చేయడానికి మనం చేసే ప్రయత్నాలు ఆయనను సంతోషపరుస్తాయి. అపారమైన కారుణ్యంతో నిండిన తన హృదయానికి మనలను చేరువ చేసుకోవడానికి అవి ఆయనకు వీలు కల్పిస్తాయి (చూడండి డైరీ #1279).
మీరు ఎప్పుడైనా మన ప్రభువు ముందు సాష్టాంగపడి ప్రార్థించారా? అలా చేసి ఉంటే, దానిని కొనసాగించండి. ప్రతిరోజూ అలా చేయడానికి అవకాశం వెతకండి. అలా చేయకపోతే, ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఏమి చెప్పాలా అని ఆందోళన చెందకండి; మొదట్లో అసౌకర్యంగా అనిపించినా ఆందోళన చెందకండి. మోకాళ్లపై నిలిచి, నేలవరకు వంగి, మన ప్రభువుపట్ల మీ ప్రేమను వ్యక్తపరచండి. అలాగే ఉండి, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ప్రయత్నించండి. ప్రభువు మీ ఆరాధనను స్వీకరించి, కారుణ్యంతో నిండిన తన తిరుహృదయానికి మిమ్మల్ని మరింత చేరువ చేసుకుంటారు.
ప్రభువా, నీ ముందు సాష్టాంగపడి, నీ మహిమ కొరకు నా జీవితమంతటినీ నిస్వార్థ కానుకగా నీకు సమర్పిస్తున్నాను. ప్రియమైన ప్రభువా, సమస్తాన్నీ నీకు ఇస్తున్నాను; దేనినీ నా కొరకు అట్టిపెట్టుకోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవే నా దేవుడవు, నా సర్వస్వమూ నీవే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
వ్యాకుల మాతకు నవదిన ప్రార్థన
సంప్రదాయంగా సెప్టెంబర్ 7–15 తేదీలలో ప్రార్థిస్తారు
దైవకారుణ్యంపై మరిన్ని ధ్యానాలు




